మా స్థలాన్ని కానిస్టేబుల్‌ ఆక్రమించాడు | - | Sakshi
Sakshi News home page

మా స్థలాన్ని కానిస్టేబుల్‌ ఆక్రమించాడు

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

ఎస్పీ ఎదుట వృద్ధుడి ఆవేదన

అనంతపురం సెంట్రల్‌: తాము కొనుగోలు చేసిన స్థలాన్ని ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆక్రమించుకున్నాడని కళ్యాణదుర్గం మండలం కడదరకుంట గ్రామానికి చెందిన వృద్ధుడు సర్దానప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీష్‌ను కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అనంతపురం రూరల్‌ మండలం పాపంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 27లో 5 సెంట్ల స్థలాన్ని 1971లో కొనుగోలు చేసినట్లు వివరించారు. సదరు స్థలాన్ని ఏఆర్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌, అతని బంధువు శ్రీరాములు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వాపోయారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 140 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్‌ స్వయంగా వినతులు స్వీకరించారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని జూమ్‌ కాన్ఫరెన్స్‌లో డివిజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ మహబూబ్‌బాషా, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

గ్యాస్‌ మిత్ర యాప్‌ను రూపొందించిన

14 ఏళ్ల బాలుడు

అనంతపురం: గోరంట్లకు చెందిన శ్రీధర్‌, చందన దంపతుల కుమారుడు, 14 ఏళ్ల గంధం ధీరజ్‌.. పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే 8వ తరగతి అభ్యసిస్తూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో గ్యాస్‌ మిత్ర యాప్‌కు రూపకల్పన చేశాడు. సామాన్య ప్రజల్లో ఎల్‌పీజీ భద్రత, పొదుపు, సైబర్‌ మోసాలపై అవగాహన పెంపొందించేలా ఈ యాప్‌ను రూపొందించడం గమనార్హం. ఎల్‌పీజీ బుకింగ్‌ అర్హత కాలిక్యులేటర్‌, గ్యాస్‌ లీకేజీపై భద్రత సూచనలు, గ్యాస్‌ పొదుపు చిట్కాలు, డీఏసీ మోసాలపై 12 భారతీయ భాషలకు వాయిస్‌ సపోర్ట్‌ చేసేలా అందుబాటులోకి తెచ్చారు. యాప్‌ రూపకర్త ధీరజ్‌ను సోమవారం జేఎన్‌టీయూ (ఏ)లోని రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ స్పోక్‌ కార్యాలయంలో సీఈఓ డాక్టర్‌ ఆర్‌.హఫీజ్‌ బాషా అభినందించారు.

సచివాలయంలో ల్యాప్‌టాప్‌ అపహరణ

రికార్డుల కాల్చివేత

ధర్మవరం అర్బన్‌: మంత్రి సత్యకుమార్‌ సొంత నియోజకవర్గ కేంద్రంలోని శివానగర్‌లో ఉన్న 5వ వార్డు సచివాలయంలో దుండగులు చొరబడి ల్యాప్‌టాప్‌ను అపహరించారు. పలు రికార్డులను కాల్చి వేశారు. సోమవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం సచివాలయానికి చేరుకున్న ఉద్యోగులు తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాలో భద్రపరిచిన ల్యాప్‌టాప్‌ కనిపించలేదు. బూడిదగా మారిన రికార్డులను గమనించి సమాచారం ఇవ్వడంతో అడిషనల్‌ ఎస్పీ అంకితా సురానా, ఇన్‌చార్జ్‌ డీఎస్పీ నర్శింగప్ప, టూ టౌన్‌ సీఐ రెడ్డప్ప, వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఉమాదేవి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement