ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గ కేంద్రం ఉరవకొండలో ప్రజల ఆస్తిగా పరిగణించబడే ప్రభుత్వ కార్యాలయాలకు పచ్చరంగు వేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి పూర్తిగా పచ్చ రంగు వేశారు. అలాగే చౌడేశ్వరీ కాలనీ సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్నీ పచ్చరంగుతో నింపేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే ఈ చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు వేయడాన్ని నివారించాలని 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం... ప్రభుత్వ కార్యాలయాలను పచ్చ రంగుతో నింపేయడం గమనార్హం. అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తోందని, దీనికన్నా టీడీపీ కార్యాలయమంటూ బోర్డులు పెట్టుకోవడం ఉత్తమమని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు.


