రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కందుకూరు పంచాయతీ పరిధిలోని కృష్ణంరెడ్డిపల్లిలో వంకలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ప్రజలకు పెద్దగా ఉపయోగం లేని రహదారిని వంకలో నిర్మించడం వల్ల రైతుల జీవనోపాధికి తీరని నష్టం వాటిల్లుతుందని గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం కారణంగా గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరు అందించే సహజ ప్రవాహం దెబ్బతింటుందన్నారు. భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేసినా... ఆదివారం రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా భారీ యంత్రాలతో పనులు కొనసాగించారని ఆరోపించారు. వెంటనే వంకలో రహదారి నిర్మాణాన్ని నిలిపివేసి, ఆ ప్రాంతంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి చెక్‌డ్యాం నిర్మించాలని నారాయణరెడ్డి, రామానాయుడు, సోమశేఖర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, లక్ష్మీ నాయుడు, హరీష్ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.


