అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రైవేట్ స్కూళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (అపుస్మా) నాయకులు వాపోయారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలల నుంచి తప్పనిసరిగా టీసీలు తీసుకున్న తర్వాతే విద్యార్థుల బదిలీలు జరగాల్సి ఉందన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల పేర్లను సంబంధిత యాజమాన్యాల అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇది కోర్టు ధిక్కారంగా పరిగణించబడే అవకాశముందని తెలిపారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యా సంస్థలకు న్యాయం జరిగేలా చట్టపరంగానే వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో అపుస్మా రాష్ట్ర కోఆర్డినేటర్ కుసుమ పుల్లారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు నాయుడు, అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిశంకర్, ట్రెజరర్ శ్రీనాథ్, నాయకులు నాగరాజు, శశిభూషణ్, శ్రీనివాస్ రెడ్డి, యుగంధర్ ఉన్నారు.


