రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లోనూ.. | - | Sakshi
Sakshi News home page

రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లోనూ..

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

కణేకల్లు : గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉన్నచోటే పనులు కల్పించి వలసలు నివారించాలని ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. పథకం అమలులో అవినీతి అక్రమాలు అరికట్టేందుకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అందులోని లొసుగులను సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుని నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. కణేకల్లు మండలం 43 ఉడేగోళంలో భారీ ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక అంతవరకు పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి.. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని నియమించారు. ఇందులో భాగంగా ఉడేగోళంలో అనిల్‌కుమార్‌కు ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ప్రభుత్వ రంగంలో పారదర్శకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఇతను అక్రమార్జన కోసం వెంపర్లాడటం విమర్శలకు తావిస్తోంది.

మీకు సగం.. నాకు సగం..

పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలు 300 మంది దాకా ఉన్నారు. ఇందులో కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగించేవారు 150 నుంచి 160 మంది ఉన్నారు. మిగిలిన వారు ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు, కూలి పనులు చేయడానికి ఇష్టం లేనివారే. ఇలాంటి వారితో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఒక ఒప్పందం చేసుకున్నాడు. పనికి వచ్చినట్టు రికార్డుల్లో రాసి.. కూలి డబ్బులు మంజూరు చేయిస్తానని, అందులో సగం మీరు తీసుకుని.. మిగతా సగం తనకు ఇస్తే చాలని ఆఫర్‌ ఇచ్చాడు. ఊరికే వస్తుంది కదా అని చాలామంది సరేనన్నారు.

ఇంటి వద్దకే వెళ్లి ఫొటోలు

43 ఉడేగోళం హెచ్చెల్సీ ఆయకట్టు ప్రాంతం కావడంతో ఉపాధి హామీ పథకం కింద ఫీడర్‌ చానల్‌, ఫీల్డ్‌ చానల్‌లో పూడికతీత పనులు చేయిస్తుంటారు. రోజు కూలి పనిని బట్టి రూ.250 నుంచి గరిష్టంగా రూ.307 వస్తుంది. పని ప్రదేశం నుంచే కూలీల హాజరు నమోదు చేసి, ఫొటోలు యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. అయితే పనికి వచ్చిన కూలీలకు అక్కడికక్కడే ఫొటోలు తీస్తుండగా... పనికే రానివారి ఫొటోలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఒకే ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేసినా టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఏపీఓ, పీఓలు పట్టించుకోకపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ తంతు సాగుతోంది.

అవినీతి సొమ్ములో వాటాలు..

43 ఉడేగోళంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.65లక్షలు, 2025–26లో రూ.58 లక్షలు, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి రూ.24.64 లక్షలు చెల్లింపులు చేశారు. పనులు చేయని కూలీల వద్ద నుంచి సగం సొమ్ము వసూలు చేసుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గ్రామంలో తనకు అండగా ఉన్న టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ లావణ్య భర్త అయిన పీవీ మారుతీ ప్రసాద్‌కు కొంత వాటా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మస్టర్లలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మాయాజాలం

పనులకు రాకపోయినా వచ్చినట్టు నమోదు

ప్రత్యేకంగా ఇళ్ల వద్దకే వెళ్లి ఫొటోలు అప్లోడ్‌

మంజూరైన కూలి సొమ్ములో సగం నొక్కుడు

తనకు అండగా ఉన్న అధికార టీడీపీ నేతకూ మేత

43 ఉడేగోళంలో వెలుగుచూసిన ‘ఉపాధి’ అక్రమాలు

ఇక్కడ కనిపిస్తున్న వారంతా కణేకల్లు మండలం 43 ఉడేగోళంలో ఈ నెల 12న ఉపాధి హామీ పనులు చేసినట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మస్టర్‌లో నమోదు చేశారు. వీరి ఫొటోలను ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే ఇందులో వృత్తంలో ఉన్న పీవీ మారుతీ ప్రసాద్‌ టీడీపీ నాయకుడు. లావణ్య ఆయన భార్య, మాజీ సర్పంచ్‌. ఆర్థిక స్థిరత్వం కలిగిన వీరు ఏనాడూ కూలి పనులు చేయలేదు. వీరికి ఆ అవసరం కూడా లేదని గ్రామప్రజలు అంటున్నారు. ఇలా వీరిద్దరే కాదు పనుల్లోకి ఏనాడూ రాని వారిని వందల సంఖ్యలో మస్టర్లలో చేర్చి.. కూలి సొమ్ము వచ్చాక అందులోంచి 50 శాతం దండుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement