కళ్యాణదుర్గంలో పలువురి ఫోన్ల హ్యాక్‌ | - | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గంలో పలువురి ఫోన్ల హ్యాక్‌

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

డబ్బు పంపాలని బంధువులు, స్నేహితులకు మెసేజ్‌లు

కళ్యాణదుర్గం రూరల్‌: పట్టణ పరిధిలో పలువురికి చెందిన ఫోన్లు ఆదివారం హ్యాక్‌కు గురయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది, దేవాదులకొండ గ్రామాలకు చెందిన పలువురి ఫోన్ల నుంచి ‘తాను ఆస్పత్రిలో ఉన్నానని, ఫోన్‌పే ద్వారా డబ్బు పంపండి’ అంటూ స్నేహితులకు, బంధువులకు వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు వెళ్లాయి. వెంటనే సదరు వ్యక్తులు ఫోన్‌ చేసి నిజమా అని కనుక్కోవడంతో అలాంటిదేమీ లేదని, తమకు తెలియకుండానే తమ ఫోన్‌ నుంచి మెసేజ్‌లు వెళ్తున్నాయని చెప్పడంతో హ్యాక్‌ విషయం బయటకు వచ్చింది. ఆందోళన చెందిన కొందరు వెంటనే తమ ఖాతాలో ఉన్న నగదును మరో ఖాతాకు జమచేశారు. అయితే హ్యక్‌ అయిన ఫోన్‌ల్లో నగదు పోయినట్లు ఎవరూ చెప్పలేదు. దీనిపై క్రైంబ్యాచ్‌ పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా... నగదు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే సెల్‌ఫోన్‌లో అనవసరమైన లింక్‌లు, ఫైళ్లు ఓపెన్‌ చేయొద్దని ప్రజలకు సూచించారు.

గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్‌

తాడిపత్రి టౌన్‌: పట్టణ పోలీసులు ఆదివారం గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పట్టణానికి చెందిన సాయి, ఘోరా హాజీ నందలపాడులోని రైల్వే బ్రిడ్జ్‌ వద్ద దాదాపు కేజీన్నర గంజాయితో ఉండగా పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

కథా రచయిత్రి

బాల భారతమ్మ కన్నుమూత

అనంతపురం కల్చరల్‌: అనంత సాహితీలోకంలో అందమైన కథలను వండివార్చిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త భాస్కర బాల భారతమ్మ (86) అనారోగ్య కారణాలతో విజయవాడలో కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని ఆదివారం అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని స్వగృహానికి తీసుకొచ్చారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, సాహితీప్రియులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. కేఎస్‌ఆర్‌ బాలికల కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ విభాగం ఇన్‌చార్జ్‌గా, ఇంటర్మీడియెట్‌ బోర్డు మెంబర్‌గా పనిచేసిన భాస్కర బాల భారతమ్మ వేల సంఖ్యలో కవితలు, 120 కథలను రచించి ‘కవితా భూషణ్‌’ అవార్డు అందుకున్నారు. సొంతంగా మూడు స్కూళ్లను స్థాపించారు. బాల భారతమ్మ కుమార్తె రాధిక ప్రస్తుతం ఐపీఎస్‌ అధికారిణిగా సేవలందిస్తున్నారు.

అనంత సాహిత్యానికి తీరని లోటు

బాల భారతమ్మ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన కవియిత్రులు డాక్టర్‌ ప్రగతి, డాక్టర్‌ అనంత మాలతి, డాక్టర్‌ ప్రసూన, నిర్మలారాణి తదితరులు మాట్లాడుతూ అనేక హృద్యమైన కథా సంపుటాలతో, ఆలోచనాత్మకమైన వ్యాసాలతో అనంత సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బాల భారతమ్మ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలోనూ ఎంతో మంది యువ రచయిత్రులకు స్ఫూర్తినింపారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement