ప్రభుత్వ టీచర్లపై ‘అడ్మిషన్ల’ కత్తి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ టీచర్లపై ‘అడ్మిషన్ల’ కత్తి

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తీవ్ర ఒత్తిళ్లు

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ల కోసం ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. విద్యాశాఖతో సంబంధం లేని మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, ఐసీడీఎస్‌ ఉద్యోగులను రంగంలోకి దింపి ‘టార్గెట్‌ అడ్మిషన్స్‌’ పేరుతో అధికార యంత్రాంగం ఊపిరాడకుండా చేస్తోందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ఏటా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ఆనవాయితీ. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిందని టీచర్లు చెబుతున్నారు. ప్రతి స్కూల్‌కూ టార్గెట్లు నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేట్‌ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావాలంటూ రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ‘ఈరోజు మీ స్కూల్‌కు ప్రైవేట్‌ స్కూల్‌ నుంచి ఎంతమంది వచ్చారు?’ అంటూ ఆన్‌లైన్‌ లింకులు పంపి వివరాలు నమోదు చేయిస్తున్నారని హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెబెక్స్‌లతో వేధింపులు

ఉదయం గ్రామాల్లో తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాక గంటల తరబడి వెబెక్స్‌లో సమీక్షలు చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. కలెక్టర్‌ నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారుల వరకు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ‘ఎందుకు వెనుకబడ్డారు?’, ‘మీ టార్గెట్‌ ఎంత?’, ‘ఈరోజు ఎన్ని అడ్మిషన్లు?’ అయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని ఎంఈఓలు, హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు మీదపడిన ఉపాధ్యాయులు ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, ఈస్థాయి ఒత్తిళ్లు మరింత మానసిక వేదనకు గురిచేస్తున్నాయని సహచరులు చెబుతున్నారు. కొంతమంది సెలవులపై వెళ్లిపోతుండగా, రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న పలువురు వీఆర్‌ఎస్‌ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇంత పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు కొనసాగుతున్నా, ప్రధానోపాధ్యాయుల సంఘం, ఉపాధ్యాయ సంఘాలు నోరు మెదపకపోవడంపై సాధారణ టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘సంఘాల ఉనికి కోసం మాత్రమే నాయకత్వమా? ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడరా?’ అంటూ మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement