‘అరసం’ రాష్ట అధ్యక్షుడిగా రాచపాలెం | - | Sakshi
Sakshi News home page

‘అరసం’ రాష్ట అధ్యక్షుడిగా రాచపాలెం

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

అనంతపురం కల్చరల్‌: అరసం (అభ్యుదయ రచయితల సంఘం) రాష్ట్ర అధ్యక్షుడిగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈనెల 23, 24 తేదీల్లో తిరుపతిలో అరసం 20వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అరసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్కేయూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అనంత సాహితీక్షేత్రంలోనే దశాబ్దాలుగా స్థిరనివాసమేర్పరచుకున్న డాక్టర్‌ రాచపాలెం చంద్రశేఖరరెడ్డిని అరసం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన సీనియర్‌ రచయితలు గుత్తా హరిసర్వోత్తమనాయుడు, ఈశ్వరరెడ్డి, వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి, తన్నీరు నాగేంద్రలకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. తిరుపతి మహాసభల్లో అనంత రచయితలు ద్విభాషా కవి డాక్టర్‌ జూటూరు షరీఫ్‌, చెట్ల ఈరన్న పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

మహిళ మృతి

ఉరవకొండ రూరల్‌: మండల పరిధిలోని పెద్ద కౌకుంట్లలో విద్యుదాఘాతంతో లక్ష్మి (35) మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాలమేరకు... ఆదివారం పెద్ద కౌకుంట్లలోని ఇంటి వద్ద ఉన్న మంచినీటి కుళాయి మోటారు ఆన్‌ చేసే క్రమంలో లక్ష్మి విద్యుదాఘాతానికి గురైందన్నారు. వెంటనే ఆమెను ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు చెప్పారన్నారు. మృతురాలికి భర్త కురుబ భీమిరెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యూరియా ద్రావణం తాగి 12 మేకల మృతి

బెళుగుప్ప: మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన హెచ్‌.వన్నూరుస్వామికి చెందిన 12 మేకలు యూరియా ద్రావణం తాగి చనిపోయాయి. మరో 19 మేకలు అస్వస్తతకు గురయ్యాయి. వివరాలు... ఆదివారం గంగవరం సమీపంలోకి జీవాలను వన్నూరుస్వామి మేపునకు తీసుకెళ్లాడు. ఇదే సమయంలో అరటి తోట కోసం తొట్టెలో కలిపిన యూరియా ద్రావణాన్ని మేకలు తాగాయి. 12 మేకలు మృతి చెందగా... మరో 19 మేకలు అస్వస్తతకు గురయ్యాయి. మండల పశు వైద్యాధికారి మంజునాథ్‌కు సమాచారం అందించగా గ్రామ పశువైద్య సహాయకుడు మారుతి వెళ్లి అస్వస్థతకు గురైన మేకలకు చికిత్స అందించారు. మేకల మృతితో సుమారు రూ.2 లక్షల పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.

గవిమఠం ఏజెంట్‌ రాజన్నగౌడ్‌ మృతి

ఉరవకొండ: ఉరవకొండ గవిమఠం ఏజెంట్‌ పాటిల్‌ రాజన్నగౌడ్‌ (72) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఆదివారం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. 20 ఏళ్లుగా గవిమఠం ఏజెంట్‌గా పనిచేస్తూ ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామికి సేవలందిస్తున్నారు. గవిమఠం పీఠాధిపతులు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్‌ కరిబసవరాజేంద్రస్వామి, ఆదోని చోకి మఠం పీఠాధిపతులు కల్యాణస్వామీజీ, మఠం సిబ్బంది గోపి, నారాయణస్వామి, మధు తదితరులు రాజన్నగౌడ్‌ మృతికి సంతాపం తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

తాడిపత్రి రూరల్‌: మండలంలోని భోగసముద్రం వద్ద ఉన్న సుగుణ స్వాన్‌ ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా కార్తీక్‌రాయ్‌ (24) ఆదివారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలమేరకు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తీక్‌రాయ్‌కి వివాహం జరుగలేదు. ఏడాది కాలంగా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఎదురుగా ఉన్న కల్యాణ మండపం పైభాగంలో అద్దెకు ఉంటున్నాడు. డిప్రెషన్‌ కారణంగా కల్యాణ మండపం ఎదురుగా ఖాళీగా ఉన్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement