● కాటా నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
కళ్యాణదుర్గం రూరల్: తప్పుడు తూకాలతో రైతులను మోసం చేస్తున్న వ్యక్తి గుట్టు రట్టైంది. వివరాలు... కళ్యాణదుర్గం పట్టణం సమీపంలోని అక్కమాంబ కొండ దగ్గర బ్రహ్మసముద్రం మండలానికి చెందిన రామ్మూర్తి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తూ కాటా (వేబ్రిడ్జి) నిర్వహిస్తున్నాడు. అయితే వాహనాలు కాటా వేసే సమయంలో 15 శాతం వ్యత్యాసం వచ్చే విధంగా యంత్రాన్ని సెట్ చేశాడు. ఆదివారం గూబనపల్లికి చెందిన చీనీ రైతు ప్రతాప్ తమ పంటను లారీల్లో వేసుకుని కాటాకు వచ్చారు. కాటా వేసుకుని వెళ్లారు. తన లారీ సాధారణంగా 22.50 టన్నులు రావాలని, ఇక్కడ కాటా వేస్తే 20 టన్నులే రావడంతో అనుమానం వచ్చి మరోచోట కాటాను వేశాడు. అయితే అక్కడ 22.50 టన్నులు వచ్చింది. దీంతో రైతులు కాటా నిర్వాహకుడు రామ్మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనకు ఏమీ తెలీదని, కాటా రిపేరీలో ఉందని సమాధానం ఇచ్చాడు. దీంతో రైతులు పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి రామ్మూర్తిపై ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కాటా నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు. అయితే.. గతంలోనే కాటా నిర్వాహకుడు రామ్మూర్తి మోసం బయట పడినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కేసు లేకుండా చేశారని రైతులు మండిపడ్డారు.
రంగంలోకి టీడీపీ నేతలు
కాటా నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే స్థానిక టీడీపీ బడా నేతలు రంగంలోకి దిగారు. కాటా నిర్వాహకుడిపై ఎలాంటి కేసు లేకుండా బయటకు తీసుకురావాలని, చిన్నపాటి కేసును నమోదు చేయాలని పోలీసులపైన ఒత్తిడి తెచ్చినట్లు రైతులు ఆరోపించారు. రైతులను మోసం చేసిన రామ్మూర్తిని కఠినంగా శిక్షించాలన్నారు.


