ఈ నెల 8న అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు రవాణా చేస్తున్న రెండు లారీలు సరిహద్దు చెక్‌పోస్టు వద్దకు వచ్చాయి. బియ్యం దందా కొనసాగిస్తున్న ఓ టీడీపీ నాయకుడు లారీ దిగి చెక్‌పొస్టు డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడి ‘మామూళ్లు’ ఇచ్చి దర్జాగా లారీలను కర్ణాటకకు తీసుకెళ్లారు. ఇలా నిత్యం వందలాది వాహనాలు సరిహద్దు చెక్‌పోస్టులు దాటుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఉరవకొండ: కర్ణాటక సరిహద్దులోని చెక్‌పోస్టులు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా సరుకులు రవాణా చేసే వాహనాలను గుర్తించి, జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు, సిబ్బంది సొంత జేబులు నింపుకుంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దున ఉన్న విడపనకల్లు, డొనేకల్లు చెక్‌పోస్టుల్లో అక్రమాల దందా యథేచ్ఛగా సాగుతోంది. రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండిపడుతోంది.
ప్రైవేట్ వ్యక్తులతో దందా..
చెక్‌పోస్టుల వద్ద డ్యూటీ కోసం రవాణా శాఖ సిబ్బంది పోటీ పడుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏదైనా వాహనం సరిహద్దులో నుంచి లోపలికి రావాలన్నా.. బయటకు వెళ్లాలన్నా అధికారులకు ముడుపులు ఇవ్వాల్సిందేనన్న చర్చ జోరుగా సాగుతోంది. అక్రమ బియ్యం, ఇసుక, మట్టి, గంజాయి, కర్ణాటక, గోవా మద్యం తదితర వాహనాలు వస్తున్నాయంటే సదరు అధికారులు, సిబ్బందికి పండగే.
● ముందుగా నిబంధనలకు విరుద్ధంగా వచ్చే వాహనాలను తనిఖీ పేరుతో సిబ్బంది ఆపుతారు. ఆ వాహనాలను పక్కన నిలపాలని సూచిస్తారు. ఆ తరువాత అక్కడే ఉండే ప్రైవేట్ వ్యక్తులు సదరు వాహనం వద్దకు వచ్చి ‘బేరం’ మాట్లాడుతారు. రోజూ విడపనకల్లు, డొనేకల్లు చెక్‌పోస్టుల వద్ద అక్రమ రవాణా వాహనదారుల నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అలా దాటించేస్తున్నారు..
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటకకు వెళ్తున్నాయి. అలాగే కర్ణాటక, గోవా మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చేస్తున్నాయి. వీటిని సాఫీగా సరిహద్దు చెక్‌పోస్టులు దాటించే పనిని ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు చేస్తున్నారు. అక్రమార్కుల నుంచి వసూళ్లు చేసి.. కొంత చెక్‌పోస్టు సిబ్బందికి ఇచ్చి.. మిగిలింది జేబుల్లో వేసుకుని సరుకును సరిహద్దు దాటించేస్తున్నారు. హెవీ లోడు వాహనాలు (6, 10, 14, 16 టైర్లు) నిబంధనల ప్రకారం 10 నుంచి 35 టన్నుల వరకు సరుకులను రవాణా చేయొచ్చు. కానీ అందుకు విరుద్ధంగా లారీల్లో 5 నుంచి 20 టన్నుల అదనపు లోడుతో వెళ్తూ..వస్తున్నాయి. అలాగే పర్మిట్, ఫిట్‌నెస్ లేని వాహనాలు నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాహనదారులకు చెక్‌పోస్టు సిబ్బంది అధికారికంగా జరిమానా విధించకుండా ‘మామూళ్లు’ తీసుకుని పంపించేస్తున్నారు. ఏదో కొన్నింటికి మాత్రం నామమాత్రపు ఫైన్ వేసి రశీదులు ఇస్తున్నారు.
గట్టి నిఘా ఉంచాం
కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టులైన విడపనకల్లు, డొనేకల్లు చెక్‌పోస్టుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఉంచాం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. ముఖ్యంగా కర్ణాటక, గోవా మద్యం సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
రామ్మోహన్‌రెడ్డి,
ఈఎస్, ఎక్సైజ్‌శాఖ, అనంతపురం
డ్యూటీల కోసం అధికారులు, సిబ్బంది పోటీ
నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలే లక్ష్యం
అక్రమ బియ్యం, ఇసుకతో పాటు కర్ణాటక, గోవా మద్యం సరఫరా
విడపనకల్లు, డొనేకల్లు సరిహద్దు చెక్‌పోస్టుల్లో అక్రమ వసూళ్లు


