అనంతపురం అగ్రికల్చర్: అధికార తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. తన ఆశీస్సులతో అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ పదవిని అలంకరించిన బల్లా పల్లవి.. ఇప్పుడు తన మాటనే బేఖాతరు చేస్తుండటాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస ఘటనలతో ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను పదవి నుంచి దించేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బల్లా పల్లవి ఈ ఏడాది జనవరి 8న చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె బాధ్యతలు చేపట్టకమునుపే ఎమ్మెల్యే సమీప బంధువులు మార్కెట్‌యార్డులో ఉన్న వేబ్రిడ్జి నిర్వహణను ఐదేళ్ల పాటు వ్యూహాత్మకంగా దక్కించుకున్నారు. చైర్‌పర్సన్ అయ్యాక వేబ్రిడ్జి నిర్వహణ బాధ్యతల నుంచి ఎమ్మెల్యే అనుచర వర్గాలను తప్పించేందుకు బల్లా పల్లవి, ఆమె భర్త బల్లా సురేష్ ప్రయత్నించడంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం సాగింది. అలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.
● మార్కెట్ యార్డులో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యేను కాదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సహకారం తీసుకోవడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గీయులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటికి తెలిసింది. వీటికి తోడు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ హర్షదుల్లాతో పాటు డైరెక్టర్లకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని కొందరు డైరెక్టర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
దారిలోకి రాలేదని.. కుర్చీ దింపేందుకు..!
తన మాటకు గౌరవం ఇవ్వని చైర్‌పర్సన్ పల్లవిని దింపేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా డైరెక్టర్లను తనవద్దకు పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. బల్లా పల్లవికి వ్యతిరేకంగా శనివారం నాటికి 10 మంది డైరెక్టర్ల నుంచి సంతకాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. మొత్తం 13 మందిలో ఓ పార్టీకి చెందిన ఇరువురు డైరెక్టర్లు సంతకాలు చేయలేదని, మరో పార్టీకి చెందిన ఓ డైరెక్టర్‌తో పాటు తొమ్మిది మంది టీడీపీ డైరెక్టర్లు ఇప్పటికే సంతకాలు చేశారని తెలుస్తోంది. మరొక డైరెక్టర్ గురించి ఇంకా తెలియరాలేదు. చైర్‌పర్సన్ బల్లా పల్లవి వద్దంటూ సంతకాలు చేసిన ఆ లేఖలను టీడీపీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు రేపోమాపో పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎత్తులు ఫలించేనా..?
ఎమ్మెల్యే దగ్గుపాటి ఎత్తులను ముందుగానే పసిగట్టిన మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ బల్లా పల్లవి ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌తో పాటు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసివచ్చినట్లు ఆ పార్టీలోని నేతలే చెబుతున్నారు. అలాగే జిల్లాకు చెందిన మంత్రి ఆశీస్సులు కూడా పల్లవి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఎత్తులు పారుతాయా..? లేక చైర్‌పర్సన్ పదవిని బల్లా కాపాడుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ పల్లవిని పదవి నుంచి దించేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రయత్నం
డైరెక్టర్ల సంతకాలతో టీడీపీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు సిద్ధం
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయాలు


