బూదగవి చెరువును తోడేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

బూదగవి చెరువును తోడేస్తున్నారు

May 24 2026 12:51 AM | Updated on May 24 2026 12:51 AM

ఉరవకొండ: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి పార్టీలకు చెందిన కొందరు నాయకులు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా హంద్రీ–నీవా కాలువ సమీపంలోని మట్టి, పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలోని కొండలు ధ్వంసం చేసి రాళ్లను దోపిడీ చేశారు. ప్రైవేట్‌ వెంచర్లకు, కాంట్రాక్టర్లకు విక్రయించుకుని రూ.లక్షల్లో పోగేసుకున్నారు. తాజాగా ఉరవకొండ మండలంలోని బూదగవి చెరువుపై కూటమిలోని ఓ పార్టీ నేత సోదరుడు కన్నేశాడు. చెరువు సమీపంలోనే ఈయనకు పొలం ఉంది. ఇంకేముంది రెండు రోజుల క్రితం ఐదు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో చెరువులో మట్టి తవ్వకాలు – అక్రమ రవాణా సాగిస్తున్నాడు. అదీ రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సాగుతోంది.

అడ్డుకునేవారే లేరా..?

బూదగవి చెరువు 92 ఎకరాల్లో విస్తరించి ఉంది. వర్షాధారంతోనే చెరువు నిండాలి. చెరువు నిండితే ఆయకట్టు పరిధిలోని 60 ఎకరాల్లో వరి, వేరుశనగ తదితర పంటలు సాగవుతాయి. సమీపంలో భూగర్భజలాలూ పెంపొందుతాయి. సాధారణంగా ఉపాధి హామీ కింద చెరువు పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేస్తారు. చెరువులో తీసిన పూడిక సారవంతమైనది. సమీపంలోని రైతుల పొలాలకు ఉచితంగా తోలుతారు. త్వరలో జలధార కింద పనులు చేయాలని అధికారులు భావిస్తుండగా.. కూటమిలోని ఓ పార్టీ నేత సోదరుడు చెరువులోకి దౌర్జన్యంగా ప్రవేశించి మట్టి తవ్వకాలు చేపట్టాడు. ఏకంగా యంత్రాలను తీసుకొచ్చి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు ఎకరాలు తవ్వేశాడు. ఇలాగే వదిలేస్తే త్వరలోనే చెరువు గుల్లవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యంత్రాలతో తవ్వడం నేరం

బూదగవి చెరువులో యంత్రాలతో మట్టిని తవ్వి తరలించడం నేరం. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి.. మట్టి తరలింపు ఆపేయాలని సూచించాం. చెరువు మట్టిని యంత్రాలతో తవ్వి అక్రమంగా సరఫరా చేయడం సరైనది కాదు. బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. – రవిప్రసాద్‌, ఎంపీడీఓ

5 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో అక్రమ తవ్వకాలు

సొమ్ము చేసుకుంటున్న కూటమి నేత సోదరుడు

సహజ వనరుల దోపిడీ నేరమని తెలిసినా చర్యలు శూన్యం

Advertisement
 
Advertisement
Advertisement