అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీటెక్, ఎంఫార్మసీ, బీబీఏ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23), రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, బీటెక్ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, ఎం ఫార్మసీ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్, సప్లిమెంటరీ, రెండో సంవత్సరం (ఆర్–21) సప్లిమెంటరీ, బీబీఏ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు ప్రకటించారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ ఎస్.శారద, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలను జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
విద్యార్థినికి ఎట్టకేలకు న్యాయం
● రీ వెరిఫికేషన్‌లో బయటపడిన ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం
● 88 నుంచి 95కి పెరిగిన మార్కులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థినికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన ఓ విద్యార్థినికి ఇంగ్లిష్ సబ్జెక్టులో 88 మార్కులు వచ్చాయి. అయితే బాగా రాసినా మార్కులు తక్కువ వచ్చాయని రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే రీ వెరిఫికేషన్‌లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో విద్యార్థినికి రావాల్సిన అదనపు మార్కులు నమోదు కాకుండా పాత మార్కులనే కొనసాగిస్తూ ఆన్సర్‌షీట్‌ను పంపించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 18న ‘రీ వెరిఫికేషన్‌లోనూ నిర్లక్ష్యం’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనం చర్చనీయాంశమైంది. దీంతో ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ నాయక్ స్పందించారు. విద్యార్థిని నుంచి పూర్తి ఆధారాలతో రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించి, బోర్డు పరీక్షల విభాగ అధికారులతో స్వయంగా మాట్లాడి విచారణ చేపట్టారు. విద్యార్థినికి ఎక్కడెక్కడ మార్కులు పెరగాల్సి ఉందో పరిశీలించిన అనంతరం ఫిర్యాదును బోర్డుకు పంపించారు. చివరకు విద్యార్థినికి న్యాయం జరుగుతూ ఇంగ్లిష్ సబ్జెక్టులో 88 మార్కుల స్థానంలో 95 మార్కులు వేశారు. శనివారం సాయంత్రం బోర్డు అధికారులు విద్యార్థిని తండ్రికి సమాచారం అందించగా, మార్కుల జాబితా పరిశీలించిన తర్వాత 7 మార్కులు పెరిగిన విషయం స్పష్టమైంది. ఈ ఘటనతో ఇంటర్ బోర్డు మూల్యాంకన విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు మూల్యాంకనంలో తప్పులు, మరోవైపు రీ వెరిఫికేషన్‌లోనూ అదే నిర్లక్ష్యం కొనసాగడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతోందని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


