బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) కళాశాలకు చెందిన విద్యార్థి ముఖేష్‌చౌదరి.. గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ పోగ్రాం–2026కు ఎంపియ్యాడు. ఈ మేరకు ఆ కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి శనివారం వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు గూగుల్ నిర్వహించిన కఠనమైన స్కీనింగ్, వీడియో కాన్ఫిరెన్స్ రౌండ్లలో ముఖేష్ చౌదరి అత్యంత ప్రతిభ కనబరిచారన్నారు. ఈ పోగ్రాం ద్వారా ఏఐ సాంకేతిక పరిజ్ఞానమైన జెమినీ టూల్స్‌ను తోటి విద్యార్థులకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాడన్నారు. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల అభివృద్దికి ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతిభ కనబచిరిన విద్యార్థిని ఆలూరి సాంబశివారెడ్డి, కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, ఐఐఐ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్‌కుమార్ యాదవ్, సీఎస్‌ఈ ఎఐఎంఎల్ విభాగ అధిపతి చిత్ర లింగప్ప, అధ్యాపకులు అభినందించారు.
అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్
తాడిపత్రి రూరల్: జల్సాలు తీర్చుకునేందుకు ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి యూజీపీఎస్ ఎస్‌ఐ ధరణి బాబు తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో తాడిపత్రిలోని నంద్యాల మార్గంలో నివాసముంటున్న పూల మహబూబ్ బాషా, ఆంజనేయ స్వామి మాన్యంలో నివాసముంటున్న పందికోన ఈరన్న, శ్రీనివాసపురం నివాసి మణిపటి శివప్రసాద్ ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు తొలుత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ద్విచక్రవాహనాన్ని అపహరించారు. రెండోసారి అనంతపురంలో, చివరిగా తాడిపత్రి పట్టణంలో ద్విచక్ర వాహనాలను అపహరించి, తక్కువ ధరకు విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకున్నారు. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో శనివారం ఉదయం తాడిపత్రిలోని కాఫీబార్‌లో నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు బైక్‌లు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి మోటర్‌సైకిళ్లను రికవరీ చేశారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
గోవా మద్యం తరలిస్తూ పట్టుబడిన అనంత వాసులు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎకై ్సజ్ అధికారులు పెద్ద మొత్తంలో గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న రెండు సెల్‌ఫోన్లు, రెండు కార్లతో సహా అనంతపురం జిల్లాకు చెందిన ఇరువురిని అరెస్ట్ చేశారు. వివరాలను ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పామిడి ఆకుల ఇర్ఫాన్, నందిండ్ల బాషా ఉన్నారు. రెండు కార్లలో 750 ఎంఎల్ కలిగిన 480 గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారు సీట్లను తొలగించి మద్యం సీసాల కేసులను అమర్చినట్లుగా గుర్తించారు. గోవా మద్యం అక్రమ రవాణాకు సంబంధించి గతంలో నందిండ్ల బాషాపై ప్రొద్దుటూరు రూరల్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పీఎస్‌ల్లో కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి తెలిపారు.
కేంద్ర మంత్రితో భేటీ
గుంతకల్లు: రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను శనివారంకలెక్టర్ ఓ. ఆనంద్, ఎస్పీ జగదీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, నాయకులు శ్రీదేవి, అంజి, వడ్డే రమేష్, షేకన్న, కొలిమి రామాంజనేయులు, హరినాధ్, విజయలక్ష్మి, పురంధర్ తదితరులు బండి సంజయ్‌ను కలిసి పుష్పాగుచ్చాలు అందజేశారు.
గుంతకల్లు–చిక్‌జాజూర్ ప్యాసింజర్ రైలు రద్దు
రాయదుర్గం టౌన్: ఈ నెల 24, 25, 30, 31 తేదీల్లో రాయదుర్గం మీదుగా రాకపోకలకు సాగించే గుంతకల్లు–చిక్‌జాజూర్ ప్యాసింజర్ రైలును (57415/57416) రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు.


