● వాల్మీకి ప్రతిభా పురస్కారాల ప్రదానంలో వక్తలు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యతోనే వాల్మీకులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.సి.అక్కులప్ప అధ్యక్షతన శనివారం స్థానిక వాల్మీకి భవన్‌లో పది, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కాలవ శ్రీనివాసులుతో పాటు జెడ్పీచైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ హాజరై, మాట్లాడారు. విద్యాపరంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల్లోని వాల్మీకి విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందేలా సమాజంలోని విద్యావంతులు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు విద్యార్థులు కష్టపడే తత్వంతో పాటు ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్యా, ఉద్యోగ పథకాలను, స్కాలర్‌షిప్‌లను వాల్మీకి యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ మహేష్, గుమ్మనూరు నారాయణస్వామి, పామిడి వీరా, కుంటిమద్ది రంగయ్య, అపెక్స్ తిరుపాలు, ముత్యాలు, డాక్టర్ శంకరనారాయణ, వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ. చైతన్యకుమార్, ట్రెజరర్ జి. పవన్ కుమార్, డాక్టర్ నివేదిత పాల్గొన్నారు.


