● కలెక్టర్ ఓ.ఆనంద్
గుంతకల్లు టౌన్: పారిశుధ్యం మరింత మెరుగుపడాలని గుంతకల్లు మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. శనివారం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన స్థానిక హనుమేష్‌నగర్, గంగానగర్ కాలనీల్లో పర్యటించారు. జనవాసాల మధ్యన ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ఖాళీ స్థలాల యజమానులందరికీ నోటీసులు జారీ చేసి చెత్తాచెదారాన్ని, కంపచెట్లను తొలగించుకుని స్థలాలను శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నోటీసులకు స్పందించకపోతే జరిమానా విధించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని శానిటేషన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవి, ఏఈ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
శుభ్రం చేయడంతోనే ఆడుకుంటున్నాం
హనుమేష్‌నగర్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతూ చిన్నారులు కలెక్టర్‌ను ఆకట్టుకున్నారు. దీంతో ఆయన కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. ఎండలో ఆడొద్దని సూచించడంతో... ‘ఈ రోజు ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించారని, అందుకే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నామ్ సార్’ అని పిల్లలు పేర్కొనగానే అధికారులు గట్టిగా నవ్వారు. అనంతరం ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


