రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తాం

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

గుమ్మఘట్ట: రెవెన్యూ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలకు పరిష్కారం చూపుతామని కలెక్టర్‌ ఆనంద్‌ స్పష్టం చేశారు. రాయదుర్గం మండలం 74ఉడేగోళం గ్రామంలోని ఆర్టీటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనలు’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. రాబోయే 15 నుంచి 20 నెలల్లో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిద్దిడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలో రీ సర్వే పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన గ్రామాల్లో సంవత్సరంలోగా పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో ఎడారి ఛాయలు అలుముకున్నాయని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఉంతకల్లు రిజర్వాయర్‌ను నిర్మిస్తే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. వేదావతి హగరిలో భూగర్భజలాలు తగ్గిపోకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో 36 అర్జీలను స్వీకరించినట్లు తహసీల్దార్‌ హరికుమార్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, ఆర్డీఓ వసంతబాబు, మండల అధికారులు పాల్గొన్నారు.

మైనింగ్‌ అక్రమాలపై చర్యలు

అనంతపురం అర్బన్‌: మైనింగ్‌ అక్రమాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని రాష్ట్ర ఎకై ్సజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో మైనింగ్‌, ఎకై ్సజ్‌ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణా, దుకాణాల సమయాలు, ఎంఆర్‌పీ విషయంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. ఉచిత ఇసుక పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పామన్నారు. ఇసుక పాలసీ అమలులో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజలకు నామ మాత్ర రుసుముతో అందిస్తున్నామన్నారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా జొన్నగిరిలో గోల్డ్‌ మైనింగ్‌ కార్యక్రమం జరుగుతోందన్నారు. అనంతపురం జిల్లాలో రామగిరి ప్రాంతంలోనూ గనుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో కలర్‌ గ్రానైట్‌ సమస్యలు పరిష్కరించి, కర్ణాటకతో ఉన్న రాయల్టీ వివాదాలను పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో రెండు రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మద్యం దుకాణాల్లో అన్ని రకాల బ్రాండ్‌లనూ అందుబాటులోకి తెచ్చామన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, ఆర్టీసీ జోనల్‌ మేనేజర్‌ పూల నాగరాజు, డీఆర్‌ఓ మలోల, అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్‌ విద్యార్థి డీబార్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఇంగ్లిష్‌ పరీక్షలో కాపీలు కొడుతూ ఓ విద్యార్థి డీబార్‌ అయ్యాడు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 6,657 మందికి గాను 6,360 మంది హాజరయ్యారు. 296 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 665 మందికి గాను 641 మంది హాజరై, 24 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్‌ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 2,214 మందికి గాను 2,036 మంది హాజరుకాగా, 178 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 176 మందికి గాను 163 మంది హాజరై, 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో భాగంగా కన్వీనర్‌, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఆరు పరీక్షా కేంద్రాలు తనిఖీ చేయగా, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఎస్‌వీఎస్‌ గురవయ్య శెట్టి ఆరు కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఆరు కేంద్రాలు, సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు ఎనిమిది కేంద్రాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఒక విద్యార్థిని మాల్‌ప్రాక్టీస్‌ కింద అధికారులు బుక్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement