‘పోలీస్‌’ ప్రక్షాళన చేసేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

‘పోలీస్‌’ ప్రక్షాళన చేసేదెప్పుడో?

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం నగరంలోని పోలీసుస్టేషన్లలో పాలన పూర్తిగా గాడి తప్పింది. త్రీటౌన్‌, నాల్గవ పట్టణ, రూరల్‌ పోలీసుస్టేషన్లకు సీఐలు లేకపోవడం.. మిగతా స్టేషన్లను పట్టించుకునే వారు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలలు దాటిపోయినా ఆయా స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓల నియామకం జరగకపోవడంపై ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న పరిస్థితిపై సామాన్య ప్రజలే కాదు.. పోలీసు సిబ్బంది కూడా నిట్టూరుస్తున్నారు.

● నెలరోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హనీట్రాప్‌ వ్యవహారం పోలీసు శాఖకు మాయని మచ్చ తీసుకొచ్చింది. కొంతమంది ముఠాలుగా ఏర్పడి అమాయకులకు వల వేసి రూ.లక్షలు దోచుకోవడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉండడంపై దుమారం రేగింది. సీరియస్‌గా పరిగణించిన అనంతపురం రేంజ్‌ డీఐజీ షిమోషి కఠిన చర్యలు తీసుకున్నారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, ముగ్గురు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించగా, అనంతపురం త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌, రూరల్‌ సీఐ శేఖర్‌ను వీఆర్‌కు పంపించారు. ఎస్‌ఐ రాంబాబు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన జరిగిన దాదాపు నెలన్నర రోజులు పూర్తయింది.

కొరవడిన పర్యవేక్షణ

హనీట్రాప్‌ వ్యవహారంలో పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకున్న తర్వాత ఆయా స్టేషన్లకు తాత్కాలికంగా ఇన్‌చార్జ్‌ సీఐలను నియమించినా వారు అంటీముట్టనట్లుగా పనిచేస్తున్నారు. అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు త్వరలో ఉద్యోగ విరమణ చేయనుండడంతో రెండు,మూడు నెలలుగా ఆయన స్టేషన్‌లపై పెద్దగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. అసలు డీఎస్పీ ఉన్నారా? లేక పోస్టు ఖాళీగా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కువశాతం ఆయన సెలవులు, ఇతర ప్రాంతాల పర్యటనల్లోనే గడుపుతున్నారు. సీఐలు లేని పోలీసుస్టేషన్‌లే కాదు ఉన్న స్టేషన్‌లలో కూడా పాలన అస్తవ్యస్తంగా తయారవుతోంది. పోలీసుస్టేషన్‌లలో నమోదవుతున్న కేసుల వివరాలేవీ బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. ఎక్కువశాతం పంచాయితీలతోనే సెటిల్‌ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అస్తవ్యస్తంగా నగర పోలీసు స్టేషన్లు

నెలరోజులు దాటినా చేపట్టని సీఐల నియామకం

మూడు, నాల్గవ పట్టణ పోలీస్‌ స్టేషన్లలో దయనీయం

ఉద్యోగ విరమణ మూడ్‌లో అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు

పోలీసు స్టేషన్లపై కొరవడిన పర్యవేక్షణ

Advertisement
 
Advertisement
Advertisement