టార్గెట్ల కోసం తంటాలు | - | Sakshi
Sakshi News home page

టార్గెట్ల కోసం తంటాలు

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

ప్రభుత్వ బడుల అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్‌ స్కూళ్లపై ఒత్తిళ్లు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలంటూ సర్కారు ఆదేశించడంతో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఉన్నతాధికారులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. కలెక్టర్‌ ఆనంద్‌ స్వయంగా రంగంలోకి దిగి రోజూ టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ అడ్మిషన్ల పురోగతిపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ అడ్మిషన్లు ఉన్న మండలాల అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులను బలవంతంగా ప్రభుత్వ బడులకు బదిలీ చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలల జోలికి వెళ్లకుండా.. ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించి, ‘సీ’ గ్రేడు స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు.

కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన

ఒకటో తరగతి అడ్మిషన్లు తప్ప ఇతర తరగతుల విద్యార్థుల బదిలీల విషయంలో యూడైస్‌లో ప్రత్యేక ప్రక్రియ ఉందని అధికారులు చెబుతున్నా.. వాస్తవంలో టీసీలు లేకుండానే విద్యార్థుల పేర్లు ఆన్‌లైన్‌ నుంచి తొలగిస్తామంటూ ఎంఈఓలు సమావేశాలు, వాట్సాప్‌ ద్వారా సూచనలు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డబ్ల్యూపీ నంబరు 9606/2021 కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, విద్యాశాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమో ప్రకారం టీసీలు తీసుకోకుండా విద్యార్థుల పేర్లు తొలగించకూడదని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు గుర్తు చేస్తున్నాయి. అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో పేర్లు తొలగించడం కోర్టు ధిక్కారమేనని హెచ్చరిస్తున్నాయి. కాగా శుక్రవారం నాటికి జిల్లాలో 762 మంది విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల సమ్మతి, సరైన విధానం పాటిస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ బలవంతపు బదిలీలు మాత్రం అంగీకరించబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement