పల్లెకు వెలుగు కరువు | - | Sakshi
Sakshi News home page

పల్లెకు వెలుగు కరువు

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

అధికారుల లెక్కలు.. సామాన్యులకు చుక్కలు

అనంతపురం క్రైం: తెల్లవారితే పట్టణాలకు ఉపాధి కోసం, చదవుల కోసం వచ్చే పేదల బతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఆర్టీసీ పేదలకు చుక్కలు చూపిస్తోంది. సకాలంలో పల్లెకు బస్సులు నడవక, నడిచినా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల చివరి దాకా వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు పెరిగారనో, అడిగేవారెవరనో కారణాలు ఏవైనా కావచ్చు తిరగాల్సిన కిలోమీటర్లకన్నా తక్కువగా బస్సులను తిప్పుతున్నారు. అలాగే పలు డిపోల పరిధిలో భారీ స్థాయిలో బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

986 కిలో మీటర్లు కట్‌..

జిల్లా వ్యాప్తంగా రోజు మొత్తంలో దాదాపుగా 3,094 కిలో మీటర్ల మేర బస్సులు తిరగాల్సి ఉంది. అయితే 2,108 కి.మీ మాత్రమే బస్సులు తిప్పుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఆధారమైన పల్లె వెలుగు సర్వీసులే అధికంగా ప్రభావితమవడంతో గ్రామీణులు పడరాని పాట్లు పడుతున్నారు. పల్లె వాసుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పల్లె వెలుగు బస్సెక్కడ అనే పరిస్థితులు దాపురించాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యానికి పరాకాష్ట

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలిపే రెండు, మూడు డిపోల పరిధిలో తిరిగిన బస్సుల మొత్తం కిలో మీటర్ల పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. గుంతకల్లు డిపోకు చెందిన ఒక ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ గుంతకల్లు – అనంతపురం మార్గంలో 492 కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. అయితే అందులో 164 కిలోమీటర్లు రద్దయ్యాయి. అలాగే తాడిపత్రి డిపో పరిధిలో పల్లె వెలుగు సర్వీసులు తాడిపత్రి – గుత్తి మార్గంలో ఒక్కోటి 114 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కళ్యాణదుర్గం – నంద్యాల మధ్య నడిచే ఒక ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లో 456 కిలోమీటర్లలో 216 కిలోమీటర్లు రద్దయ్యాయి. ఉరవకొండ డిపో పరిధిలో పల్లె వెలుగు సర్వీసులు కూడా భారీగా ప్రభావితమయ్యాయి. అనంతపురం – పులకుంట మార్గంలో నడిచే సర్వీస్‌ కూడా కొంత మేర రద్దయింది. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, రోజువారీ కూలీలు ఈ సర్వీసులపై ఆధారపడుతుండగా... ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ రవాణా కోసం ప్రజలు అధిక ఖర్చుతో పాటు ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఆర్టీసీ తన సేవలను పల్లెలకు విస్తరించలేకపోతోంది. ప్రధానంగా కిలో మీటర్ల మేర రద్దయిన బస్సుల్లో ఎక్కువ శాతం గ్రామీణ మార్గాలుండటం విచారకరం. లాభదాయక మార్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు పల్లెలకు వెళ్లే సర్వీసులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు ఉన్న బస్సులు కూడా సిబ్బంది కొరత, డ్రైవర్లు–కండక్టర్ల లోటు, బస్సుల్లో సాంకేతిక సమస్యలు, సరైన నిర్వహణ లేకపోవడం వంటి కారణాల వల్ల తరచూ సర్వీసులు రద్దవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా సర్వీసులు నిలిపేస్తుండటంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ప్రజా రవాణాను బలోపేతం చేస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక రోజులోనే దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర సర్వీసులు రద్దు కావడం చిన్న విషయం కాదని రవాణా నిపుణులు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం, పాడైన బస్సులను మరమ్మతు చేయించడం, గ్రామీణ మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

లాభదాయక రూట్లపైనే ఆర్టీసీ అధికారుల దృష్టి

గ్రామాలను గాలికి వదిలేసిన వైనం

అనంతపురం రీజియన్‌లో రోజూ

దాదాపు 986 కి.మీ మేర

బస్సు సర్వీసుల రద్దు

తీవ్ర ఇబ్బందుల్లో గ్రామీణ ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement