శెట్టూరు: మండలంలోని ఎర్రబోరేపల్లికి చెందిన గొల్ల నాగేంద్ర కుమారుడు శ్రీకాంత్ ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకోంది. గ్రామస్తుల వివరాలమేరకు.. గ్రామ సమీపంలోని నల్లకొండ ప్రాంతంలోకి శ్రీకాంత్ గొర్రెలను మేపు కోసం తీసుకెళ్లాడు. అదే సమయంలో పొదల చాటున దాగి ఉన్న ఎలుగుబంటి శ్రీకాంత్‌పై ఒక్కసారిగా దాడిచేసి గాయపర్చింది. చుట్టు పక్కల రైతులు గమనించి ఎలుగుబంటిని తరిమివేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సుధాకర్‌రెడ్డి
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగమైన పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎం. సుధాకర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎం.సుధాకర్‌రెడ్డికి కీలకమైన పదవి దక్కడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు.
గంజాయి విక్రేత అరెస్టు
గుత్తి: పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన తపిల రఘు అనే గంజాయి విక్రేత, మట్కా బీటరును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 1,10,000 నగదుతో పాటు 50 గ్రాముల గంజాయి, మట్కా చీటీలు, బాల్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ గతంలో కొందరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశామన్నారు. అయితే తపిల రఘుతో పాటు మరో ఇద్దరు పరారయ్యారన్నారు. వారిలో తపిల రఘును అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
హోరాహోరీగా రాతిదూలం పోటీలు
పెద్దవడుగూరు: మండల పరిధిలోని ఆవులాంపల్లిలో శుక్రవారం జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభాల రాతిదూలం లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. రెండవరోజు న్యూ కేటగిరి విభాగంలో వృషభాల పోటీలు ప్రారంభం కాగా పోటీల్లో 17 జతలు పాల్గొన్నాయి. హోరా హోరీగా జరిగిన పోటీలో మొదటిస్థానంలో కడప జిల్లా చౌటపల్లె మూర్థల చంద్ర ఓబుళరెడ్డి, రెండో స్థానంలో పల్నాడు జిల్లా ఇర్లపాడు మంగు రమాదేవి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా ఏ.నారాయణపురంకు చెందిన షేక్ మహ్మద్ ఫరీద్ ఎద్దులు నిలిచాయి. వారికి వరుసగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు నగదు బహుమతులను అందజేశారు.


