ప్రేమ పేరుతో బాలికలపై అత్యాచారం?! | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో బాలికలపై అత్యాచారం?!

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

పోలీసుల అదుపులో నిందితులు

తాడిపత్రిటౌన్‌: సెల్‌ఫోన్‌, టీవీలను చూస్తూ ప్రేమకు ఆకర్షితులై అభం శుభం తెలియని బాలికలు కేటుగాళ్ల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. శుక్రవారం తాడిపత్రి పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. తాడిపత్రి పట్టణం సంజీవనగర్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థినిని అదే కాలనీకి చెందిన 10వ తరగతి చదివి మానేసిన బాలుడు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో పాటు బాలికతో దాదాపు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఇప్పించుకొని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి జల్సా చేశారు. అలాగే టైలర్స్‌ కాలనీకి చెందిన మరో 8వ తరగతి విద్యార్థినిని.. ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థి ప్రేమ పేరుతో వంచించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నుంచి దాదాపు 6 తులాలు బంగారు ఆభరణాలు ఇప్పించుకొని ఇంటికి ఏసీ, తల్లిదండ్రులకు విలువైన సెల్‌ఫోన్లను కొనిచ్చినట్లు తెలిసింది. అయితే ఇంట్లోని బంగారం మాయం కావడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు బాలికలను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. విషయాన్ని బాలికల తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితులతో పాటు వారి స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గుట్టుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

సెల్‌ఫోన్‌ చూస్తూ

కానరాని లోకాలకు...

నీటి సంపులో పడి యువకుడి మృతి

బ్రహ్మసముద్రం: నీటి సంప్‌లో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పిల్లలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు... మండల పరిధిలోని పిల్లలపల్లికి చెందిన మాల మల్లన్న నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. వారింట్లో టైల్స్‌, గ్రానైట్‌ బండలు వేసే పనికి అనంతపురం నుంచి యువకులు వచ్చారు. వారిలో అనంతపురంలోని చంద్రబాబునగర్‌కు చెందిన మహ్మద్‌ గౌస్‌ (25) కూడా ఉన్నాడు. గురువారం రాత్రి మహ్మద్‌ గౌస్‌ సెల్‌ఫోన్‌ చూసుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంటిముందు ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement