యల్లనూరు: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీడీ చెన్నకేశవులు హెచ్చరించారు. యల్లనూరు మండలవ్యాప్తంగా ఉపాధి పనుల్లో సాగుతున్న అక్రమాలపై ‘దోచెయ్.. వాటాలేసెయ్’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై కలెక్టర్ ఆనంద్ ఆరా తీశారు. ఈ క్రమంలో ఏపీడీ చెన్నకేశవులు హుటాహుటిన యల్లనూరు చేరుకుని ఎంపీడీఓ కరుణసాగర్, ఏపీఓ ఓబిరెడ్డి, ఈసీ సత్యమూర్తి, టెక్నికల్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బినామీ పేర్లు రాస్తే మస్టరు రద్దు చేస్తామని హెచ్చరించారు.కూలీల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పీడీ సలీంబాషా దృష్టికి తీసుకెళ్లి ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో
బొమ్మనహాళ్: కర్ణాటక రాష్ట్రంలో హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. డ్యాం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీరు వచ్చి చేరుతోంది. బుధవారం 515 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 9.730 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,633 అడుగులకు గాను 1,588.38 అడుగులకు నీటి మట్టం చేరింది.
● తొలకర్ల కోసం రైతన్న ఎదురుచూపు
● వానల్లేక వేసవి దుక్కులు చేసుకోలేని దుస్థితి
అనంతపురం అగ్రికల్చర్: వర్ష‘మే’ లేకుండా పోయింది. ఖరీఫ్‌కు సన్నద్ధం కావడానికి రైతుకు ఇబ్బందిగా మారింది. మేలో సాధారణంగా 36.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా కేవలం 11.5 మి.మీ కురిసింది. పెద్దపప్పూరు, రాప్తాడులో మాత్రమే సాధారణం కన్నా కాస్త అధికంగా వర్షం పడింది. 15 మండలాల్లో తుంపర్లు పడగా మిగతా 15 మండలాల్లో చినుకు రాలలేదు. జూన్ నుంచి 2026 ఖరీఫ్ మొదలు కానుంది. ముంగారు వ్యవసాయానికి పొలాలు దక్కులు చేసుకోవాల్సిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవిలో కురిసే వర్షాలకు లోతుగా దుక్కులు చేసుకోవడం, గత ఖరీఫ్ పంట అవశేషాలు తొలగించుకుని ఖరీఫ్‌కు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మునుపెన్నడూ లేనంతగా 42 నుంచి 44 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రెండు నెలలకు పైగా ‘అనంత’ వేడెక్కిపోయింది. వరుణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. 10 రోజుల్లో ముంగారు వ్యవసాయం మొదలు కానుండగా... తొలకరి చినుకు కోసం అన్నదాత ఎదురుచూస్తున్నాడు.
15 ఏళ్లలో మొదటిసారి..
మే నెల సాధారణ వర్షపాతం 36.7 మి.మీగా అంచనా వేసినా అంతకు మించి వర్షాలు పడుతూ వస్తున్నాయి. 15 ఏళ్లుగా మేలో సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడటంతో పంట పొలాలు దుక్కులు చేసుకుని సాగుకు వెసులుబాటు లభించింది. ఈ సారి సీజన్ సమీపిస్తున్నా ‘తొలకర్లు’ వెనుకాడుతున్నాయి. ‘ఎల్–నినో’ మొదలైందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు నెలాఖరు నాటికి ప్రవేశించినా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు. కనీసం మే నెలలో మోస్తరు వర్షాలు నమోదై ఉంటే రైతులు పొలంబాట పట్టే పరిస్థితి ఉండేది. ఈనెలలో రెండు మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి తుంపర్లు మినహా సరైన తొలకర్లు నమోదు కాలేదు. గతేడాది, అంతకు మునుపు ఏడాది మే నెలలో అయితే భారీ వర్షాలు కురిశాయి. 2021, 2022, 2023 మేలో కూడా మంచి వర్షపాతం నమోదైంది. అయితే, 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఎల్–నినో మొదలు కావడంతో జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌ను కబళించే ప్రమాదం ఉన్నట్లు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


