తాడిపత్రిటౌన్: తాడిపత్రి సీఐ ఆరోహణరావు తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్ల వద్దకు అర్ధరాత్రి వేళ వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారిని టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నెల 18న పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును నిరసిస్తూ తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ కౌన్సిలర్, పార్టీ మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ బాబుపై వేధింపులకు దిగడమే ఇందుకు నిదర్శనం. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రభాకర్ బాబు ఇంటి వద్దకు వెళ్లిన సీఐ ఆరోహణరావు బలవంతంగా ఆయనను పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంట పాటు స్టేషన్‌లో ఉంచుకుని ఫొటోలను తీసుకున్న అనంతరం పంపించారు. ఎలాంటి కారణం చెప్పకుండా తీసుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ప్రభాకర్‌బాబును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాక ఫొటోలు తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే సీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే..
మూడు రోజులుగా పదుల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారిని సైతం పిలిచి కేసులు నమోదు చేయడం గమనార్హం. రౌడీషీట్లున్న టీడీపీ నాయకులను మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సీఐ ఆరోహణరావును వివరణ కోరగా ప్రతి ఏడాది చేసినట్లుగానే వైఎస్సార్‌సీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపిస్తున్నామన్నారు. మూడు రోజుల్లో 20 మందికి పైగా వైఎస్సార్‌సీపీ నాయకులను బైండోవర్ చేశామని, మరో 20 మందిని బైండోవర్ చేస్తామన్నారు. టీడీపీ నాయకుల బైండోవర్‌పై మాత్రం మాట దాటవేయడం గమనార్హం.ప్రభాకర్‌బాబును అర్ధరాత్రి స్టేషన్‌కు తీసుకెళ్లడంపైనా ఆయన స్పందించలేదు.
వివాదాస్పదమవుతున్న తాడిపత్రి సీఐ ఆరోహణరావు తీరు
ప్రతిపక్ష పార్టీ నాయకులను అర్ధరాత్రి స్టేషన్‌కు తరలిస్తూ భయభ్రాంతులు
‘పచ్చ’ నేతల మెప్పు కోసమే రెచ్చిపోతున్నారనే విమర్శలు


