న్యూస్‌రీల్
తాడిపత్రి రూరల్: పట్టణంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఆలయంలో తెలుగు శాసనం వెలుగు చూసినట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయ ప్రవేశ మార్గం వద్ద ఉన్న గాలి గోపురంలో కొణిదెల చిన క్రిష్ణమనాయుని తెలుగు శాసనం కనుగొన్నామన్నారు. సామాన్య శకం 1554 డిసెంబర్ అనంతనామ సంవత్సరం మార్గశిర మాసంలో శాసనాన్ని రాశారన్నారు. ప్రాకార గోపుర నిర్మాణానికి గుత్తి తిరుమల నాయుడు 510 వరహాలు, కొణిదెల చెన్నమశెట్టి కుమారుడు ఓబయ్య 210 వరహాలు దానంగా ఇచ్చారని తెలిపారు. గుత్తి తిరుమలనాయుడు అరవీటి రామరాయల మనవడన్నారు. శాసనంలో చింతల వెంకటరమణస్వామి దేవాలయాన్ని శ్రీతల తిరువెంగళనాథ గుడిగా పేర్కొన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అర్చకుడు శ్రీనివాసదేశికన్ పాల్గొన్నారు.
‘సత్యసాయి’ కార్మికుల
సమ్మె విరమణ
కూడేరు: సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులు గురువారం సమ్మె విరమించారు. పీఏబీఆర్ నుంచి గ్రామాలకు తాగునీరు సరఫరా చేశారు. కలెక్టర్ ఆనంద్, బోర్డు అధికారులు, ఎస్‌ఈ ప్రభాకర్, డీఈ రామారావుతో జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమించారు. నెలాఖరుకు పెండింగ్ వేతనాల విడుదల, జిల్లా పరిషత్‌లో విలీనం చేయకుండా చర్యలు, సమ్మె కాలంలోనూ వేతనం ఇవ్వడం తదితర డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు, యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, అధ్యక్షుడు మధు తెలిపారు.


