24న సివిల్స్‌ ప్రిలిమినరీ | - | Sakshi
Sakshi News home page

24న సివిల్స్‌ ప్రిలిమినరీ

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

అనంతపురం అర్బన్‌: ‘‘యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 24న సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఏడు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 2,515 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టండి’’ అని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అన్నారు. పరీక్ష నిర్వహణపై కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫ రెన్స్‌ హాలులో యూపీఎస్‌సీ అధికారి ప్రవీందర్‌ సింగ్‌, డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్‌–1 ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఇన్విజిలేటర్లకు 23న శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షకు కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతారని, ఇందుకు అనుగణంగా బస్సులను నడపాలని ఆర్‌టీసీ అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు మూడు వందల మీటర్ల పరిధిలో సైబర్‌ కేఫ్‌లు, జిరాక్స్‌ కేంద్రాలు, ప్రింటింగ్‌ షాపులను బంద్‌ చేయించాలని చెప్పారు. పరీక్ష సమయం కంటే 30 నిమిషాల ముందే కేంద్రాల గేట్లను మూసివేస్తారని, నిర్దేశిత సమాయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోరని అభ్యర్థులకు కలెక్టర్‌ స్పష్టం చేశారు.

అప్రమత్తంగా ఉండండి

అనంతపురం అర్బన్‌: జిల్లాలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ ప్రజలకు సూచించారు. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయట తిరగకూడదన్నారు. తరచూ మంచినీరు, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమై బయటికి రావాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి వాడాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జనసమూహం ఉండే ప్రదేశాల్లో తాగునీరు, నీడ సదుపాయం కల్పించాలన్నారు. వీధి కుక్కలు, పక్షుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement