నాణ్యత లోపిస్తే సహించను | - | Sakshi
Sakshi News home page

నాణ్యత లోపిస్తే సహించను

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తి చేయాలి

అధికారులకు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశం

అనంతపురం అర్బన్‌: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే సహించబోనని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను హెచ్చరించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన అంగన్‌వాడీ భవనాలు, మూత్రశాలలు, గ్రామ సమైక్య భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తాగునీటి వసతి, విద్యుత్‌ సరఫరా పనులు పూర్తి చేయాలన్నారు. కేజీబీవీల్లో చేపట్టిన పనులు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లైనింగ్‌ పనులు, హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎంశ్రీనిధి కింద మంజూరైన నిధులతో పాఠశాలల్లో చేపట్టిన పనులు గడువులోగా పూర్తవ్వాలని చెప్పారు. ఎంపీ నిధులతో చేపట్టి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పీఎంఏజేవై కింద కణేకల్లులో చేపట్టిన వసతి గృహం జూలై ఆఖరుకు పూర్తి చేయాలన్నారు. గుతకల్లులోని మైనారిటీ గురుకుల పాఠశాలను రెండు రోజుల్లోగా మైనారిటీ సంక్షేమ శాఖకు అప్పగించాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ సుబ్బరాయుడు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణ, మైనర్‌ ఇగిరేషన్‌ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, సీపీఓ అశోక్‌కుమార్‌, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సాగు పట్టాలు

కూడేరు: అసైన్డ్‌ భూమిని సాగు చేసుకుంటున్న వారిలో అర్హత కల్గిన పేదలందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. బుధవారం మరుట్ల–2వ కాలనీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ పట్టాల ఎంపిక జాబితా తయారీపై గ్రామ సభ నిర్వహించారు. కలెక్టర్‌ విచ్చేసి మాట్లాడారు. మరుట్ల పంచాయతీ పరిధిలో అసైన్డ్‌ భూమిని సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు మంజూరు చేయాలని కలెక్టరేట్‌లో, మండల కేంద్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలామంది అర్జీలు అందజేశారన్నారు. వీటిపై రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 47 మందిని అర్హులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. వారి పేర్లను అధికారులు చదివి వినిపించారు. ఇంకా అర్హత ఉండి జాబితాలో పేర్లు లేకపోతే మరోమారు విచారణ చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్‌ ఉదయ్‌ భాస్కర్‌, మండల సర్వేయర్‌ ఆయేషా సిద్ధిఖీ, వీఆర్వో వెంకట శివారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement