పిడుగుపాటుకు ఎద్దుల మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఎద్దుల మృతి

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

శింగనమల: మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఏకులనాగేపల్లిలో పిడుగుపాటుకు రైతు వసంతకుమార్‌ రెడ్డికి చెందిన రెండు ఎద్దులు చనిపోయాయి. రెండు వారాల క్రితమే రూ.1.50 లక్షలతో వాటిని కొనుగోలు చేసినట్లు బాధిత రైతు వాపోయాడు.

టెంకాయ చెట్టుపై పిడుగు

గార్లదిన్నె: మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ఎం.కొత్తపల్లి గ్రామంలో రైతు కిష్ట ఇంటి వెనుక ఉన్న టెంకాయ చెట్టుపై పిడుగు రాలడంతో మంటలు చెలరేగాయి. అలాగే కల్లూరు, ఇల్లూరులో వడగండ్ల వర్షం కురిసింది.

వ్యక్తి దుర్మరణం

అనంతపురం సెంట్రల్‌: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో శింగనమల మండలం నిదనవాడకు చెందిన శేషానందరెడ్డి(40) దుర్మరణం పాలయ్యాడు. బుధవారం అనంతపురంలోని తపోవనం నుంచి బళ్లారి మార్గం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ సీఐ వెంకటేష్‌ నాయక్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.

కొండుపల్లి గనుల్లో విచారణ

పెద్దవడుగూరు: మండలంలోని కొండుపల్లిలో సర్వే నంబర్‌ 313ఏ లో ఉన్న మైనింగ్‌ ప్రాంతాన్ని తాడిపత్రి మైనింగ్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగుతున్నాయనే ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏడీఏ ఓబుళరెడ్డి, సిబ్బంది, మండల సర్వేయర్‌ ప్రసాద్‌, వీఆర్వోలు పాల్గొన్నారు.

తాగునీటి కోసం నిరసన

గుమ్మఘట్ట: తాగునీటి సమస్య తీర్చాలంటూ బుధవారం భైరవానితిప్ప గ్రామస్తులు స్థానిక సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పంచాయతీ బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఇమ్రాన్‌ అక్కడకు చేరుకుని తాగునీటిని సరఫరా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement