బొమ్మనహాళ్: యజమానికి తప్ప ఇతర ఏ సంస్థ, వ్యక్తులకు చట్టబద్ధంగా ఎలాంటి అధికారాలు ఉండని ఫ్రీహోల్డ్ భూ సమస్యలకు రెండు, మూడు నెలల్లో పరిష్కారం చూపుతామని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. బొమ్మనహాళ్ మండలం కొలగానహాళ్లి, ఏలంజి గ్రామాల్లో కొనసాగుతున్న రీ–సర్వే పనులను బుధవారం జేసీ పరిశీలించారు. జాయింట్ ఎల్పీ నంబర్లు, ఫ్రీహోల్డ్ రికార్డులకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నాలుగో విడత రీసర్వే కొనసాగుతుందని త్వరలో ఐదో విడత సర్వే ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ఫ్రీహోల్డ్, జాయింట్ ఎల్పీ నంబర్ల సమస్యలకు పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ చర్యలు వేగవంతం చేసిందన్నారు. రీ సర్వేలో 5 సెంట్ల వరకు తేడాలు కనిపించడం సహజమని పేర్కొన్నారు. అయితే కొందరు రైతుల రికార్డులో ఉన్న విస్తీర్ణానికి మించి సాగు చేస్తున్న భూములు ప్రస్తుతం రీ సర్వే ద్వారా బయటపడుతున్నాయని తెలిపారు. అనంతరం మండలంలోని నేమకల్లులో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. డీఎస్‌ఎల్‌ఏ కనకప్రసాదరావు, సర్వే ఇన్‌స్పెక్టర్ అంజలీదేవి, బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలు, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ, సర్వేయర్ రవితేజ, వీఆర్వో యుగంధర్, పంచాయతీ కార్యదర్శి యల్లప్ప పాల్గొన్నారు.


