టిప్పర్‌ ఢీ.. యువతి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీ.. యువతి దుర్మరణం

Mar 9 2026 7:24 AM | Updated on Mar 9 2026 7:24 AM

పుట్లూరు: టిప్పర్‌ ఢీకొని యువతి దుర్మరణం చెందింది. ఇదే ప్రమాదంలో ఆమె తాత గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఈదుల శివారెడ్డి, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె ఈదుల అఖిల (23) అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఎమ్మెస్సీ చదువుతోంది. సెలవులు రావడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ఆదివారం తాత పెద్ద కుళ్లాయిరెడ్డితో కలిసి తాడిపత్రికి ద్విచక్రవాహనంపై వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. ఎ.కొండాపురం 544డీ జాతీయ రహదారిపై వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా వస్తున్న ఎస్‌ఆర్‌సీ కంపెనీకి చెందిన టిప్పర్‌ తాకింది. బ్యాగు తగిలించుకున్న అఖిలను టిప్పర్‌ కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అఖిల మృతి చెందింది. పెద్దకుళ్లాయిరెడ్డి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువతి మృతితో సంజీవపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

బాబు విధానాలతో

రైతుల పరిస్థితి దయనీయం

మాజీ మంత్రి శైలజానాథ్‌ ధ్వజం

అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొక్కజొన్నవ, పప్పుశనగ ధరలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న క్వింటాలు మద్దతు ధర రూ.2,400 ఉంటే.. మార్కెట్‌లో దళారులు రూ.1,600 కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. పప్పుశనగను కూడా మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడం వల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి, దారుణంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. తక్షణమే మద్దతు ధరతో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

నేటి నుంచి ‘ఈ–క్రాప్‌’

సామాజిక తనిఖీ

తప్పులుంటే 14 లోపు సవరణకు అవకాశం

16న ప్రభుత్వానికి తుది ముసాయిదా

అనంతపురం అగ్రికల్చర్‌: రబీ ఈ–క్రాప్‌ నమోదు పూర్తయినందున సోమవారం నుంచి ఆర్‌ఎస్‌కేల్లో సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ముదిగల్లు రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌ఎస్‌కేల్లో జాబితాలు ప్రదర్శించడంతో పాటు గ్రామసభలు నిర్వహించి ఈ–క్రాప్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత రికార్డులతో ఫిర్యాదు అందజేసి సవరించుకునే వీలుందని పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు సామాజిక తనిఖీ ఉంటుందని, ఈ నెల 16న రబీ ఈ–క్రాప్‌ తుది ముసాయిదా ప్రభుత్వానికి పంపుతామని వెల్లడించారు. వివిధ పథకాల వర్తింపునకు ఈ–క్రాప్‌కు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇకపోతే ఈ రబీలో వంద శాతం ఈ–క్రాప్‌ నమోదు జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,91,938 సర్వే నంబర్లకు సంబంధించి 12,17,464 ఎకరాల్లో పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. అదులో వ్యవసాయ పంటలు 3,63,399 ఎకరాలు, ఉద్యాన పంటలు 30,392 ఎకరాలు, మల్బరీ 167 ఎకరాలతో పాటు 8,23,506 ఎకరాలు బీడుభూములు, ఇతరత్రా వ్యవసాయేతర భూములు ఉన్నట్లు ఈ–క్రాప్‌లో నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ క్రాప్‌ పారదర్శకత కోసం వివిధ స్థాయిలో సూపర్‌చెక్‌ పూర్తి చేశామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆర్‌ఎస్‌కేల్లో వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలను సంప్రదించి సవరించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement