రైతుల సహనానికి పరీక్ష
గుంతకల్లు రూరల్: కందుల కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దళారుల చేతిలో తక్కువ ధర– తూకాలతో మోసపోవడం కన్నా మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఉపశమనం పొందుదామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. వెల్లువలా వస్తున్న సరుకును అధికారులు నత్తనడకన కొనుగోలు చేస్తుండటంతో రైతులు కేంద్రం వద్దే తిండీ తిప్పలు మాని, చలిలో వణుకుతూ నిద్రలేక అవస్థలు పడుతున్నారు. గుంతకల్లు మార్కెట్‌యార్డులో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మార్క్‌ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.8వేలుగా నిర్ణయించింది. బయటి మార్కెట్‌లో దీనికన్నా ధర తక్కువగా ఉండటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రానికి సరుకును తీసుకొస్తున్నారు. ధాన్యాన్ని మార్క్‌ఫెడ్ సంస్థ ఎప్పటికప్పుడు తరలించకపోవడంతో కొనుగోలు కేంద్రం పూర్తిగా కందుల స్టాకుతో నిండిపోయింది. రైతుల నుంచి కొత్తగా కొనుగోలు చేసే కందులను ఉంచేందుకు అవసరమైన స్థలం లేదు. దీనికితోడు గోనెసంచుల సరఫరా నిలిచిపోయింది. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ మందగించింది. ఈ పరిస్థితుల్లో పంటను విక్రయించేందుకు మార్కెట్‌యార్డుకు వచ్చిన రైతులు రెండు, మూడు రోజులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాత్రిపూట విపరీతమైన చలి ఉండటం, దానికితోడు దోమల బెడద కూడా ఎక్కువగా ఉండటంతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా, కందుల కొనుగోళ్లు సక్రమంగా, సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు.. దాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల నిర్వాకంతో తిండీ, నిద్ర మాని మార్కెట్‌యార్డులో నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగా స్థానికంగా రైతు భరోసా కేంద్రంలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా.. అందరినీ ఒకేచోటకు సరుకు తీసుకొచ్చి అమ్ముకోవాలని చంద్రబాబు ప్రభుత్వం చెప్పడంతో రైతుల అవస్థలు రెట్టింపయ్యాయి.
నత్తనడకన కందుల
కొనుగోళ్లు
సరుకుతో నిండిన గుంతకల్లు మార్కెట్‌యార్డు
సరిపడ గోనెసంచులూ అందుబాటులో లేని వైనం
స్టాకు కదిలేదాకా కొనేది లేదంటున్న అధికారులు
కేంద్రం వద్ద రోజుల తరబడి రైతుల పడిగాపులు
గుంతకల్లు మండల వ్యాప్తంగా ఖరీఫ్‌లో 35,250 ఎకరాల విస్తీర్ణంలో కంది సాగు చేశారు. మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ నెల 9 నుంచి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 550 మంది రైతుల నుంచి 10,860 క్వింటాళ్ల కందులు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో తమవంతు రావడానికి రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మందకొడి కొనుగోళ్లు రైతుల సహనానికి పరీక్షగా నిలుస్తున్నాయి.
రైతుల సహనానికి పరీక్ష


