ఫిబ్రవరి వరకు హంద్రీ–నీవాకు నీరు
అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఫిబ్రవరి నెలాఖరు వరకు కృష్ణా జలాలు వచ్చే అవకాశముందని జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ (సీఈ) నాగరాజ తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కర్నూలు జిల్లా మల్యాల వద్ద ఇప్పటి వరకు 39.5100 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో అనంతపురం జిల్లా సరిహద్దుకు 37.557 టీఎంసీలు వచ్చాయన్నారు. జీడిపల్లి జలాశయం నుంచి 34.543 టీఎంసీలు, గొల్లపల్లి రిజర్వాయర్‌కు 20.990 టీఎంసీలు, అన్నమయ్య జిల్లాకు 3.972 టీఎంసీలు వెళ్లాయన్నారు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇప్పటి వరకు 200 చెరువులు నింపినట్లు చెప్పారు.
ప్రాజెక్టులు ప్రారంభిస్తాం
అనంతపురం అర్బన్: పీఎం కుసుమ్ కింద జిల్లాలో 111 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేపట్టిన ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ప్రాజెక్టులపై ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్‌తో పాటు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం కుసుమ్ కింద 20 ప్రాంతాల్లో 111 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం చేపట్టిన అన్ని ప్రాజెక్టులనూ పది రోజుల్లో మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చలిమంటలో పడి.. ప్రాణాలు కోల్పోయి..
యాడికి: మద్యం మత్తులో ఓ వ్యక్తి చలిమంటలో పడి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. తూట్రాళ్లపల్లికి చెందిన రామాంజనేయరెడ్డి (55) ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. గత నెల 31న విపరీతంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. చలిగా ఉందని ఇంటి వద్ద మంట వేశాడు. చలి కాచుకుంటున్న సమయంలో మద్యం మత్తులో తూలి మంటలో పడిపోయాడు. తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రామాంజనేయరెడ్డి బుధవారం మృతి చెందాడు.
తాడిపత్రిలో మాతృ మరణం
● ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
తాడిపత్రి రూరల్: ప్రైవేట్ ఆస్పత్రిలో మాతృమరణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండల కేంద్రానికి చెందిన లావణ్య (27), ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడైన పుట్లూరు మండలం కుమ్మనమలకు చెందిన శరత్‌బాబు దంపతులు. లావణ్య గర్భం దాల్చింది. ఆమెకు తాడిపత్రిలోని కృష్ణాపురం మూడవ రోడ్డులో గల నిహిర నర్సింగ్ హోంలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండటంతో మంగళవారం స్వగ్రామం నుంచి నర్సింగ్‌హోంలో చేర్చారు. సాధారణ ప్రసవం కష్టమని, సిజేరియన్ చేయాల్సి ఉందని వైద్యురాలు తెలిపారు. బుధవారం ఉదయం సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ గర్భసంచికి రంధ్రం ఏర్పడి రక్తస్రావం మొదలైంది. వైద్యురాలు పరిశీలించి.. లావణ్యకు మూడు బాటిళ్ల రక్తం ఎక్కించారు. అయినా పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే లావణ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహించి మృతదేహాన్ని తాడిపత్రికి తీసుకొచ్చి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిజేరియన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయని, డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు వచ్చి ఆందోళనకారుల వద్దకు వచ్చి సర్దిచెప్పి, శాంతింపజేశారు. ఇదిలా ఉండగా లావణ్య ప్రసవించిన మగ శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది.
ఫిబ్రవరి వరకు హంద్రీ–నీవాకు నీరు
ఫిబ్రవరి వరకు హంద్రీ–నీవాకు నీరు


