అడ్డగోలుగా డీటీ పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా డీటీ పదోన్నతులు

Jan 22 2026 7:04 AM | Updated on Jan 22 2026 7:04 AM

అడ్డగోలుగా డీటీ పదోన్నతులు

అడ్డగోలుగా డీటీ పదోన్నతులు

కేటాయింపులో శ్రీసత్యసాయి జిల్లాకు కోత

నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు

అనంతపురం అర్బన్‌: రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పించే క్రమంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. గతంలో తహసీల్దారు బదిలీల్లోనూ ఏకంగా ఐదుసార్లు ఉత్తర్వులను మార్చారు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతి కల్పించిన క్రమంలో అనుసరించిన విధానం మరోసారి చర్చనీయాంశమైంది. అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌ కల్పించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

శ్రీసత్యసాయి జిల్లాకు కోత

రెవెన్యూ శాఖలో 16 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. ఆ తరువాత పోస్టింగ్‌ ఇచ్చే విషయంలో శ్రీసత్యసాయి జిల్లాకు కోత పెట్టారు. 16 పోస్టుల్లో ప్యానల్‌ ప్రకారం 12 పోస్టులు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించాలి. నాలుగు పోస్టులు అనంతపురం జిల్లాకు కేటాయించాలి. అయితే తొలి ఆర్డర్‌లో శ్రీసత్యసాయి జిల్లాకు నాలుగు పోస్టులు, అనంతపురం జిల్లాకు 12 పోస్టులు కేటాయించారు. ఇది వివాదం కావడంతో లాటరీ నిర్వహించి మరో ముగ్గురికి శ్రీసత్యసాయి జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. దీంతో ఆ జిల్లాకు ఏడు పోస్టులు ఇచ్చినట్లయ్యింది. వాస్తవంగా ప్యానల్‌ ప్రకారం 12 పోస్టులు ఇవ్వకుండా ఏడు పోస్టులతో సరిపెట్టారు. ఇక అనంతపురం జిల్లాకు నాలుగు పోస్టులు ఉంటే 9 పోస్టులు కేటాయించారు. ఇది పూర్తిగా అసంబద్ధ చర్య అని సీనియర్‌ రెవెన్యూ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు

పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు, చెక్‌పోస్ట్‌ డిప్యూటీ తహసీల్దారు పోస్టుల్లో రెగ్యులర్‌ డీటీలను నియమించాల్సి ఉంటుందని సీనియర్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే పదోన్నతుల ద్వారా నియమించారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ఇక పదోన్నతులు కల్పిస్తూ డీటీలకు ఇచ్చిన పోస్టింగ్‌ ఒక చోట పనిచేయాల్సిన ప్రదేశం మరోచోట చూపడం కూడా సరైన విధానం కాదని చెబుతున్నారు.

తప్పుదోవ పట్టించిన అధికారులు

సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించే విషయంలో ఉన్నతాధికారిని కూడా ఇక్కడి కొందరు అధికారులు తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. ప్రధానంగా జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు శాంక్షనింగ్‌ పోస్టుల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. డీటీలుగా పదోన్నతులు కల్పించే విషయంలో చిక్కులు ఉన్న కారణంగానే గత కలెక్టర్‌ పెండింగ్‌ లో ఉంచారని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement