అలరించిన ‘రంగోత్సవ్’
● ఉత్సాహంగా ఆడిపాడిన అనంతపురం జిల్లా చిన్నారులు
● రాష్ట్ర స్థాయి పోటీలకు 8 మంది ఎంపిక
పుట్టపర్తి అర్బన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళానైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్వహించిన ‘రంగోత్సవ్’ అందరినీ అలరించింది. బుక్కపట్నంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి ‘రంగోత్సవ్’ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులు పోటీపడి తమ ప్రతిభను చాటారు. డ్రాయింగ్, హ్యాండ్‌రైటింగ్, ఫోక్ డాన్స్, రోప్‌ప్లే తదితర విభాగాల్లో పోటీ పడ్డారు. ఆయా విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి ‘రంగోత్సవ్’ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన 8 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని, వారంతా 23వ తేదీన విజయవాడ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొంటారని డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. రంగోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకులను, ఉపాధ్యాయులను అభినందించారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులు..
● రంగోళి విభాగం: పి.ఉషోదయ, అనూశ్రీ (అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట ఉన్నత పాఠశాల)
● డ్రాయింగ్: జి.ప్రీతి (అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసలుడికి ఉన్నత పాఠశాల)
● హ్యాండ్ రైటింగ్: కె. జాహ్నవి (శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం వశిష్ట ఇంగ్లిష్ మీడియం స్కూల్)
● ఫోక్ డ్యాన్స్: వర్షిత, వర్షిణీ, మహతేజ్, మనుశ్రీ (అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి ఉన్నత పాఠశాల)


