రంజీకి రంగం సిద్ధం
● నేటి నుంచి ఆంధ్ర–విదర్భ మ్యాచ్
● ప్రవేశం ఉచితం
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురంలో రంజీ మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి అనంతపురం క్రికెట్ గ్రౌండు (ఆర్డీటీ మైదానం)లో ఆంధ్ర–విదర్భ జట్ల మధ్య నాలుగు రోజుల పాటు బీసీీసీఐ రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. జిల్లాలోని క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగారు. భారతజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులు పాల్గొంటుండడంతో వారి ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉచిత ప్రవేశం కల్పించారు. అభిమానులు కూర్చుని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. ఇప్పటికే ఇరుజట్ల క్రీడాకారులు రెండు రోజుల పాటు సాధన చేశారు. మ్యాచ్ అధికారులు గ్రౌండ్‌ను తనిఖీ చేశారు. మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించడానికి గ్రౌండ్, టర్ఫ్ వికెట్, మార్కింగ్‌లు, స్టంప్‌లు, బాల్స్, ఇతర వస్తువులను పరిశీలించారు. మ్యాచ్ కోసం పచ్చని మైదానం, టర్ఫ్ పిచ్‌ను సిద్ధం చేశారు. మ్యాచ్ రిఫరీ అజయ్ కుడువా, అంపైర్లు వైభవ్ ధోక్రే, ప్రణవ్ జోషి, స్కోరర్లు కేఎం షణ్ముఖం, ఏఎల్ నరసింహం, వీడియో విశ్లేషకులు ఎస్.ఇమ్రాన్ పాషా, జీఎన్ శ్రీనివాస్‌రావు, ఏసీఎల్‌ఓ కేఏ ఫయాజ్ అహ్మద్, ఇరుజట్ల మేనేజర్లు, కెప్టెన్లతో సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నిర్వహణ అధికారులు ఆట పరిస్థితులను వివరించారు, మ్యాచ్ కోసం అనుసరించాల్సిన ఆటగాళ్ల ప్రవర్తనను కెప్టెన్లు, మేనేజర్‌కు తెలియజేశారు. ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా రికీ భుయ్, విదర్భ జట్టు కెప్టెన్‌గా హర్షదుబే వ్యవహరించనున్నారు. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి యుగంధర్‌రెడ్డి తెలిపారు.


