మధ్యాహ్న భోజనం అధ్వానం
● వినయ్‌కుమార్ ఎయిడెడ్ స్కూల్ ఫిర్యాదుల బాక్సులో విద్యార్థుల లేఖలు
రాప్తాడురూరల్: రాప్తాడు మండల పరిధిలోని చిన్మయనగర్‌లోని వినయ్‌కుమార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోందంటూ విద్యార్థులు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు పెట్టారు. ఇటీవల ఈ ఫిర్యాదుల బాక్సును స్వయంగా మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున ఓపెన్ చేయగా అందులో పలువురు విద్యార్థులు ‘భోజనం రుచిగా ఉండడం లేదు ఫాదర్’ అంటూ రాసిన లేఖలు కనిపించాయి. ఇక్కడ 6–10 తరగతి విద్యార్థులు వందలాదిమంది చదువుతున్నారు. కూలీనాలి చేసుకునే కుటుంబాల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారికి మధ్యాహ్న భోజనం వరంలా ఉంటుంది. అయితే వినయ్‌కుమార్ స్కూల్‌లో పెడుతున్న భోజనం రుచి, నాణ్యతగా లేకపోవడంతో పిల్లలు తినలేకపోతున్నారు. దీంతో తమ పిల్లలకు ఇంటినుంచి క్యారియర్లు పంపుతున్నామని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంఈఓ మల్లికార్జున మాట్లాడుతూ వినయ్‌కుమార్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదులు అందాయన్నారు. తాను స్వయంగా స్కూల్‌లో ఫిర్యాదుల బాక్సు ఓపెన్ చేస్తే అందులోనూ విద్యార్థులు అన్నం రుచిగా లేదంటూ రాసిన లేఖలను పరిశీలించానన్నారు. నిర్వాహకులు తీరు మార్చుకోకపోతే ఏజెన్సీని మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ స్పష్టం చేశారు.


