తీవ్ర సంక్షోభంలో అన్నదాత
అనంతపురం:జిల్లాలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. జిల్లాలో అరటి రైతులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో మంగళవారం కలెక్టర్ ఓ. ఆనంద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలను కలెక్టర్‌కు వివరించారు. ఎకరా అరటి సాగుకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెడితే.. కనీసం రూ.5 వేలు కూడా రైతుకు అందడం లేదని పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పొలాల్లోనే ట్రాక్టర్‌తో అరటి పంటను దున్నేస్తున్న పరిస్థితిని వివరించారు. దిగుబడి వచ్చిన అరటి గెలలను కలెక్టర్‌కు చూపించారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ఎదుటే అరటికాయలు అమ్మి నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తక్షణమే అరటిని కొనుగోలు చేయాలి..
జిల్లా నుంచి రైతుల వలసలు అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి వాపోయారు. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో అరటి సాగైతే 8 లక్షల టన్నుల దిగుబడి వస్తోందన్నారు. టన్ను కేవలం రూ.1,000 నుంచి రూ.2,000 పలుకుతుండడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రస్తుతం అరటి రైతులు గిట్టుబాటు ధర లేక పంటలను తోటల్లోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అరటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కల్పించి రైతుల వద్దే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అరటి ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ రైల్‌ను ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించిన పరిస్థితి ఉండేదని ఆయన వివరించారు.
ఆ ఫ్లెక్సీలు ఏమయ్యాయో?
ఇటీవల జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన సమయంలో టీడీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ కట్టారని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ప్రగల్భాలు పలికారని, నేడు ఆ ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నాయో అంటూ మాజీ ఎంపీ, పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. అరటికి కనీస మద్దతు ధర ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించామన్నారు. ఇప్పుడు అరటికి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు కనీసం ఒక్క చోటైనా చూపించండి అంటూ సవాలు విసిరారు.
రైతులకు ఏం చేశారో చెప్పాలి..
అరటి పంటను పొలాల్లో ట్రాక్టర్‌తో దున్నేస్తుంటే బాధేస్తోందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అనే విధానంతో పాలన సాగిస్తూ రైతన్నలను చిన్నచూపు చూస్తున్నారన్నారు. జిల్లాలో అరటి రైతన్న కుదేలవుతున్నాడన్నారు. హార్టికల్చర్ వైపు వెళ్లాలంటేనే రైతులు నిరుత్సాహపడుతున్నారని, ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ‘మీ కోసం రైతన్నా’ అంటూ డ్రామాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. 18 నెలల కాలంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర ఇచ్చారా? రాయితీలు ఇచ్చారా అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్ రెడ్డి, పంచాయతీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మారుతీ నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, శివశంకర్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస నాయక్, పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వై. నారాయణ రెడ్డి, జెడ్పీటీసీలు భోగాతి ప్రతాప్ రెడ్డి, నీలం భాస్కర్, బొమ్మల శ్రీరామిరెడ్డి, ముసలన్న, మండల కన్వీనర్‌లు పూల ప్రసాద్, కన్వీనర్ ఎల్లా రెడ్డి, కన్వీనర్ గువ్వల శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ వలి, శివశంకర్, మహేష్ రెడ్డి, కల్లూరు సూర్యనారాయణ రెడ్డి, చికెన్ నారాయణ స్వామి, శ్రీనివాస రెడ్డి, తిమ్మాపురం రాఘవ రెడ్డి, చింత కుంట మల్లికార్జున రెడ్డి, ఎల్లుట్ల శేఖర్, బాలరాజు, తిరుపతయ్య, భయేశ్వర రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు పెత్తందార్లపై ఉన్న ప్రేమ రైతన్నలపై లేదు
అన్నదాతను ఆదుకోకపోతే
తీవ్రస్థాయిలో ఉద్యమం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజం
పార్టీ నేతలు శైలజానాథ్, రంగయ్య, విశ్వతో కలిసి కలెక్టర్‌కు వినతి పత్రం


