తాడిపత్రిలో ‘తమ్ముళ్ల’ పేకాట పంచాయితీ
తాడిపత్రి టౌన్: తాడిపత్రిలో జేసీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇన్నాళ్లూ ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేసి నానా రచ్చ చేసిన జేసీ వర్గీయులు... తాజాగా సొంతపార్టీ నేతలనే టార్గెట్ చేశారు. ముందునుంచీ వైరివర్గంగా ఉంటున్న ‘కాకర్ల’ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం తాడిపత్రి మండల పరిధి లోని హునాపురం గ్రామ సమీపంలో ఉన్న టీడీపీ నాయకుడు కాకర్ల రంగనాఽథ్‌కు చెందిన మామిడి తోటపై పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.89,020 నగదు, మూడు కార్లు, 13 మోటార్ సైకిళ్లు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో చాలా మంది పారిపోయారని, వారిలో కాకర్ల సోదరుడు, బంధువులు ఉన్నారని, వారిని కావాలనే పోలీసులు వదిలేశారని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు ఆరోపించారు. దాదాపు వంద మంది జేసీ అనుచరులు ఏఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి కాకర్ల సోదరుడితో పాటు కుటుంబీకులను అరెస్ట్ చేయాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ పెద్దల సూచనలతో ఆందోళన చేయకుండానే జేసీ వర్గం నాయకులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అనంతరం మంగళవారం రాత్రిపొద్దుపోయాక తాడిపత్రి అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ శివగంగాధర్‌రెడ్డి 16 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిలో కాకర్ల జగన్నాథ్, కాకర్ల రంగనాథ్, కాకర్ల చంద్ర, గాలి సురేష్ రెడ్డి, తమ్మినేని శివకృష్ణ, షేక్ మహబూబ్ బాషా,రామినేని భాస్కర్, ఎల్లనూరు శివకృష్ణ, కోడూరు శ్రీనివాసులు, కడవకల్లు నాగేంద్ర, మీసాల విష్ణు, మారినేని కృష్ణమోహన్, కూచివారిపల్లి పట్టాభిరామయ్య, గన్నె నరేష్ కుమార్ నాయుడు, మాలపాటి లోకేశ్వర రెడ్డి, గుత్తి రవి కుమార్ ఉన్నట్లు ప్రకటించారు. అయితే పోలీసులు జేసీ ఒత్తిడితోనే తన వర్గంపై కేసు అక్రమ కేసులు నమోదు చేశారని టీడీపీ నాయకుడు కాకర్ల వర్గం ఆరోపించింది. మొత్తంగా తాడిపత్రిలో తమ్ముళ్ల పేకాట పంచాయితీ చర్చనీయాంశంగా మారింది.
పాలవాయిలో వెలుగు అధికారుల పర్యటన
కళ్యాణదుర్గం: ‘యానిమేటర్ భర్త చేతివాటం’ శీర్షికన ఈ నెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వెలుగు అధికారులు స్పందించారు. మండలంలోని పాలవాయి గ్రామంలో ఓ వ్యక్తి బోగస్ సంఘాలను ఏర్పాటు చేసుకుని తప్పుడు రికార్డులు సృష్టించాడు. రూ.30 లక్షలు స్వాహా చేశాడు. ఈ విషయంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మంగళవారం ఏపీఎం నారాయణస్వామి పాలవాయిలో పర్యటించారు. గతంలో పనిచేసిన యానిమేటర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో యానిమేటర్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక.. రూ. లక్షలు స్వాహా జరిగిన సమయంలో పనిచేసిన సీసీలు తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
‘చంద్రబాబు రైతులను
పట్టించుకోవడం లేదు’
యాడికి: సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు మండిపడ్డారు. మంగళవారం యాడికి రైతు సేవా కేంద్రం వద్ద ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏఓ మహబూబ్‌బాషా పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఆదినారాయణ నాయుడు అనే రైతు మాట్లాడుతూ గత ఏడాది తన పొలంలో సాగు చేసిన పంటకు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రీమియం చెల్లించినా నష్ట పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఈ ఏడాది బీమా ప్రీమియం కట్టలేదన్నాడు. గతంలో ప్రభుత్వమే ఇన్‌పుట్ సబ్సిడీ ప్రీమియం కట్టి రైతులకు నష్ట పరిహారం అందజేసిందని, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
తాడిపత్రిలో ‘తమ్ముళ్ల’ పేకాట పంచాయితీ


