‘ఎస్‌ఐఆర్’పై అవగాహన ఉండాలి
● ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరి
● అధికారులకు డీఆర్‌ఓ మలోల ఆదేశం
అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించి త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంబంధిత అధికారులను డీఆర్‌ఓ మలోల ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌పై కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌ఓ), ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ల (ఈడీటీ)లతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఎస్‌ఐఆర్ నిర్వహణ షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ త్వరలో విడుదల చే యనుందన్నారు. గతంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్ ) నిర్వహించే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం దాని స్థానంలో ఎస్‌ఐఆర్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇందులో ఏవైనా సందేహాలు తలెత్తితే నివృత్తి చేసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. తొందరపాటు నిర్ణయాలతో తలెత్తే ఇబ్బందులకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఈఆర్‌ఓలుగా ఉన్న ఆర్‌డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఏఈఆర్‌ఓలుగా ఉన్న తహసీల్దార్లు, ఎన్నికల విభాగం డీటీలు పాల్గొన్నారు.


