ఐసీడీఎస్‌లో కలకలం
● శిశుగృహలో చిన్నారి మృతికి కారణమైన ఉద్యోగులపై వేటు
● ఒకేసారి ఏకంగా ఏడుగురి తొలగింపు
● కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం
అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖలో కలకలం రేగింది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న శిశుగృహలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత నెల 2న శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారి నిరూప్ మృతి ఘటన పర్యవసానంగా వారిపై వేటుపడింది. ఐసీడీఎస్ చరిత్రలోనే ఒకేసారి.. ఒక విభాగంలో పనిచేస్తున్న అందరినీ తొలగించిన దాఖలాలు లేవు. కలెక్టర్ ఆనంద్ తీసుకున్న నిర్ణయంతో శిశుగృహ మొత్తం ప్రక్షాళన జరిగినట్లయింది. మేనేజర్ దీప్తితో పాటు సోషల్ వర్కర్ లక్ష్మిదేవి, ఏఎన్‌ఎం గుణవతి, ఆయాలు, ఆదిలక్ష్మి, నూర్జహాన్, ప్రభావతి, వాచ్‌మెన్ రాజశేఖర్‌ను తొలగించారు.
విభేదాలతో చిన్నారుల సంక్షేమం గాలికి..
మగబిడ్డకు జన్మనిచ్చిన కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కాసేపటికే పసికందును వదులుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు పసికందును అక్కున చేర్చుకొని జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో చికిత్సలు అందించిన అనంతరం శిశుగృహలో అప్పగించారు. అయితే ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది నిత్యం విభేదాలతో గొడవలకు దిగేవారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 2న ఓ ఆయా ఉన్న ఫళంగా విధులకు హాజరుకాలేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన మేనేజర్ దీప్తి పట్టించుకోలేదు. విధుల్లో ఉన్న ఒక్క ఆయా అందరినీ చూసుకోలేకపోవడంతో ఆకలితో అలమటించి చిన్నారి నిరూప్ మృతి చెందాడు. విషయాన్ని బయటకు పొక్కకుండా గుట్టుచుప్పుడు కాకుండా శ్మశానవాటికలో ఖననం కూడా చేయడం విమర్శలకు దారి తీసింది. కనీసం కలెక్టర్, ఆ శాఖ డైరెక్టరేట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో స్పందించిన ఐసీడీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జిల్లాకు వచ్చి ఘటనపై ఆరా తీశారు. కలెక్టర్ ఆనంద్ త్రిసభ్య కమిటీని నియమించారు. పై అధికారులకు సమాచారం ఇవ్వలేదనే కారణంతో వెంటనే అప్పటి పీడీ నాగమణిని సస్పెండ్ చేశారు.
శభాష్ కలెక్టర్..
తాజాగా శిశుగృహ విషయంలో కలెక్టర్ ఆనంద్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. తొలినుంచి శిశుగృహ సిబ్బందిపై అవినీతి ఆరోపణలున్నాయి. ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళను బంగారు, డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో ఏకంగా కేంద్ర మంత్రి వరకూ ఫిర్యాదుల వెళ్లాయి. హిందూపురం పట్టణానికి చెందిన మహిళతో నగరంలోని ఓ బంగారు దుకాణంలో నెక్లెస్ కొనుగోలు చేయించుకున్న వైనం వెలుగుచూసింది. తరుచూ అవినీతి ఆరోపణలు వస్తున్నా గతంలో పనిచేసిన ఐసీడీఎస్ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారింది. చివరికి చిన్నారి ప్రాణం బలి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ అనంతరం కలెక్టర్ ఆనంద్ శిశుగృహ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శిశుగృహలో చిన్నారులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆశా వర్కర్‌లు, ఏఎన్‌ఎంలను నియమించిన తర్వాత వేటు వేశారు. త్వరలో శిశుగృహలో నూతనంగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.


