పెన్షనర్లు.. అష్టకష్టాలు
● రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో
చంద్రబాబు సర్కారు చెలగాటం
● బెనిఫిట్లు అందించడంలో తాత్సారం
● 30 ఏళ్లలో ఇలా లేదంటున్న పెన్షనర్లు
అనంతపురం అర్బన్: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పెన్షనర్ల కష్టాలు చెప్పనలవిగా మారాయి. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆర్థిక ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. చేతిలో డబ్బు లేక కొందరు పెన్షనర్లు ఇళ్లలో జరగాల్సిన శుభకార్యాలయాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు.
గ్రాట్యూటీ రూ.94.88 కోట్లు పెండింగ్
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా రూ.16 లక్షలు చెల్లి స్తుంది. జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో 593 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినట్లు సమాచారం. వీరికి గ్రాట్యుటీ రూపంలో అందాల్సిన రూ.94.88 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇక.. సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగుల్చుకున్న ఎర్న్ లీవ్‌లకు (ఈఎల్) రిటైర్మెంట్ సమయంలో డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఉద్యోగి దాదాపు 300 రోజులు (పది నెలలు) ఎర్న్ లీవులను వెనక్కి ఇస్తారు. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షలుగా 593 మందికి రూ.47.44 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం..
రిటైర్మెంట్ బెనిఫిట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంపై కొందరు పెన్షనర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన కొందరు కోర్టులో కేసు వేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత బెనిఫిట్లను ప్రభుత్వం మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉంచరాదని సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని పెన్షనర్ల సంఘం నాయకులు చెబుతున్నారు.
పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. 18 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదు. 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ఉద్యోగి రిటైర్ అయిన 3 నెలల్లోపు బెనిఫిట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.
– శీల జయరామప్ప, పెన్షనీర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
పెన్షనర్లు.. అష్టకష్టాలు


