
‘ఓపెనింగ్’ అదిరింది
అనంతపురం కార్పొరేషన్: బీసీసీఐ ఆధ్వర్యంలో అనంతపురం స్పోర్ట్స్ సెంటర్‌లోని ప్రధాన క్రీడామైదానం వేదికగా గురువారం ప్రారంభమైన సీకే నాయడు క్రికెట్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి డిల్లీ జట్టుపై 74.2 ఓవర్ల వద్ద రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులతో పటిష్ట స్థాయికి చేరుకుంది. వర్షం కారణంగా 15 ఓవర్లు మిగిలి ఉండగానే ఆట ముగిసింది. బీసీసీఐ నూతన నిబంధనల మేరకు టాస్ లేకుండానే అతిథి జట్టుకు బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఢిల్లీ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్‌రెడ్డి, కార్యదర్శి భీమలింగారెడ్డి, సహాయ కార్యదర్శి జి.మురళీకృష్ణ, ఏసీఎల్‌ఓ శర్మాస్‌వలి, తదితరులు పర్యవేక్షించారు. బ్యాటింగ్ బరిలో దిగిన ఆంధ్ర జట్టు ఓపెనర్ సాయిశ్రావణ్ నిలకడగా ఆడుతూ 160 బంతుల్లో 9 బౌండరీలతో 73 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్‌గా వచ్చిన మరో బ్యాటర్ జీఎస్‌పీ తేజ 165 బంతుల్లో 8 బౌండరీలతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో దేవ్‌లక్రా 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకోగా, భరద్వాజ్ 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూలదోశాడు.
చికిత్స పొందుతూ
యువకుడి మృతి
గుమ్మఘట్ట: ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందాడు. వివరాలు... గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప గ్రామానికి చెందిన తిప్పేస్వామి, గంగమ్మ దంపతుల కుమారుడు నవీన్ (25) పది రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఉన్న తన సోదరిని చూసేందుకు ద్విచక్రవాహనం వెళుతుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను తొలుత కళ్యాణదుర్గంలో ప్రాథమికి చికిత్స అందజేసి అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక నవీన్ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఘటనపై కళ్యాణదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.