
మార్కెట్‌యార్డులో ‘తాళ్ల’ పంచాయితీ
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో రెండు రోజులుగా తాళ్ల పంచాయితీ నడుస్తోంది. ప్రతి శని, ఆదివారం నిర్వహించే గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, ఆవులు, గేదెలు, ఎద్దుల సంతల్లో వివిధ రకాల తాళ్లు అమ్ముకునేందుకు ఏటా టెండర్ నిర్వహించి, నిబంధనల మేరకు కోట్ చేసిన వారికి అనుమతులు ఇస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది రామాంజినేయులు అనే వ్యక్తి ఏడాదికి రూ.16.38 లక్షలు చొప్పున మూడేళ్లకు టెండర్ దక్కించుకున్నాడు. ఈ ఆగస్టు నుంచి తాళ్లు అమ్ముకోవడం మొదలు పెట్టాడు. అయితే ఉన్నఫళంగా శుక్రవారం, శనివారం కొందరు వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులమని హల్‌చల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెటింగ్ ఏడీ, గ్రేడ్–2 సెక్రటరీ, ఇతర అధికారులతో పాటు టెండర్ దక్కించుకున్న వ్యక్తులతో ఘర్షణకు దిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తాళ్లు అమ్ముకునే బాధ్యత తమకే అప్పగించాలంటూ రెండు రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు సాధ్యం కాదని చెబుతున్నా.. తాము కూడా తాళ్లు అమ్ముకుంటామని శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ఆవరణలో కాసేపు హడావుడి చేసినట్లు తెలిపారు. అయితే టెండర్ దక్కించుకున్న వాళ్లు ఏమాత్రం తగ్గకుండా తాము కూడా మార్కెటింగ్ అధికారులు, పోలీసులతో పాటు మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళతామని హెచ్చరించడంతో సమస్య ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు చెబుతున్నారు. తాము పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి టెండర్ దక్కించుకుని తాళ్ల వ్యాపారం చేసుకుంటుంటే.. జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ యార్డు గేటు బయట, పరిసర ప్రాంతాల్లో తాళ్లు అమ్ముకోవడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. తాళ్ల అమ్మకం పంచాయితీపై మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరికీ గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. వీరి మధ్య పోటీ కారణంగా ఈసారి తాళ్ల టెండర్ గరిష్టంగా రూ.16.38 లక్షలు పలికినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యే అనుచరులమంటూ కొందరు హల్‌చల్
తమకు బాధ్యతలివ్వాలని టెండర్‌దారులతో ఘర్షణ
ఎవ్వరికీ చెప్పలేక మార్కెటింగ్ శాఖ అధికారుల మౌనం