
పచ్చని చెట్లతోనే స్వచ్ఛమైన గాలి
కూడేరు: పచ్చని చెట్లతోనే స్వచ్ఛమైన గాలి (మనం పీల్చే ఆక్సిజన్) లభిస్తుందని ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం కూడేరులో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఎంపీ, కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత భగవతి ఫంక్షన్ హాలు నుంచి పెట్రోల్ బంక్ వరకు విద్యార్ధులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత వర్మీకంపోస్టు ఎరువు తయారు చేశారు.. ఎంత విక్రయించారు.. ఎంత ఆదాయం వచ్చిందని ఆరా తీస్తే అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మండల అధికారులతో కలిసి కలెక్టర్, ఎంపీ మానవహారంగా ఏర్పడ్డారు. పరిశుభ్రత పాటిస్తామని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పెన్నహోబిలం వద్ద త్వరలో మొక్కలు నాటే ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించారు. తర్వాత జాగృతి ఫౌండేషన్ చైర్మన్ పురుషోత్తం అందజేసిన బట్టతో తయారు చేసిన సంచులు, మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ శివశంకర్, డ్వామా పీడీ సలీం బాషా, డీఎప్‌ఓ గురు ప్రభాకర్, డీఆర్‌డీఏ పీడీ శైలజ, డిప్యూటీ ఎంపీడీఓ రాధాకృష్ణ, తహసీల్దార్ మహబూబ్‌బాషా, ఎంఈఓ మహమ్మద్ గౌస్, ఏపీఓ పోలేరయ్య, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.