
శిక్షణ అంశాలు ఆచరణలో పెట్టాలి
రాయదుర్గంటౌన్: శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను పాత్రికేయులు ఆచరణలో పెట్టి వృత్తికి వన్నె తేవాలని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు సూచించారు. రాయదుర్గంలోని ఓ ఫంక్షన్ హాలులో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ‘గ్రామీణ విలేకర్ల పునశ్చరణ తరగతులు’ శనివారంతో ముగిసాయి. శిక్షణకు సురేష్‌కుమార్, సుబ్బరావుతోపాటు చివరి రోజు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు నైపుణ్యంతో ఎదగాలని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అయూబ్, శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ ప్రతినిధులు కమలాక్షుడు, గురు రాఘవేంద్రప్రసాద్, ఖాజా హుస్సేన్, ఆవుల మనోహర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.