
చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రజా ఉద్యమం
రాయదుర్గంటౌన్: సీఎం చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రజా ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ, పంచా యతీ సంస్థాగత కమిటీల ఎంపికపై అవగాహన కార్యక్రమంతోపాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం ‘దుర్గం’లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త సైనికుడిలా మారాలన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేసేందుకే కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ కమిటీలతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. కార్యకర్తలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా అండగా నిలవనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలలు పూర్తయి వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తే జగన్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం మెడలు వంచి ప్రైవేటీకరణను నిలుపుదల చేద్దామని పిలుపునిచ్చారు. నకిలీ మద్యానికి ఏపీ అడ్డాగా మారిందన్నారు. బెల్టు దుకాణాలు తెరిచి.. వాటి ద్వారా కల్తీ మద్యాన్ని అమ్ముతూ కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజగోపాలరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పొరాళ్ల శివకుమార్, పట్టణ కన్వీ నర్ మేకల శ్రీనివాసులు, మండల కన్వీనర్ రామాంజనేయులు, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, డీ.హీరే హాళ్ కన్వీనర్లు బ్రహ్మానందరెడ్డి, రామాంజనేయులు, గౌని కాంతారెడ్డి, రామాంజనేయులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకటరామిరెడ్డి
కార్యకర్తలకు పెద్దపీట వేసేందుకే సంస్థాగత కమిటీలు: మెట్టు

చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రజా ఉద్యమం