సేవ పేరుతో దోపిడీ | - | Sakshi
Sakshi News home page

సేవ పేరుతో దోపిడీ

Oct 20 2025 7:50 AM | Updated on Oct 20 2025 7:50 AM

సేవ ప

సేవ పేరుతో దోపిడీ

భక్తుల సెంటిమెంట్‌ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొందరు స్వార్థపరులు. సేవ పేరుతో చందాలు వసూలు చేస్తూ అక్రమార్జనకు తెరలేపారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం వేదికగా చేసుకున్నారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉన్నా... పెత్తనం మొత్తం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉండడంతో భక్తులకు అసౌకర్యాలు తప్పడం లేదు.

ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాలోనే కాకుండా కర్ణాటకలోనూ భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న ఆత్మకూరు మండలం పంపనూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర ప్రతిష్టను కొందరు స్వార్థపరులు దిగజారుస్తున్నారు. దేవదాయశాఖ పరిధిలోని ఈ ఆలయంలో పెత్తనమంతా ప్రైవేట్‌ వ్యక్తులదే కావడం గమనార్హం. ప్రతి వారమూ రూ.లక్షల్లో ఆదాయం ఉన్నా... ఆ ఆదాయం ఏమవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒక్కప్పుడు 3.90 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయం.. ప్రస్తుతం 50 సెంట్లకు మించి లేదు. మిగిలిన ప్రదేశంలో అనధికార గోశాల, అన్నదాన కమిటీ అంటూ ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమించుకున్నారు. స్వామికి సేవ చేస్తున్నామనే పేరుతో నెలకు రూ. లక్షల్లో దోపిడీ సాగిస్తున్నారు.

పెత్తనమంతా వారిదే..

దశాబ్దాలుగా పంపనూరు ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతోంది. ఇదేమని అడిగితే స్వామి వారికి సేవ చేస్తున్నామని చెబుతున్నారు. దేవదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేకుండా ఆలయంలో గోశాల నిర్వహణ, అన్నదానం అంటూ కమిటీలు ఏర్పాటు చేశారు. గోశాలను ఆదినారాయణ నాయుడు, అన్నదాన కమిటీని సత్య రంగయ్య అనధికారికంగా నిర్వహిస్తున్నారు. గోశాలలో ప్రస్తుతం 60 వరకు ఆవులు ఉన్నాయి. ఆలయానికి వచ్చే భక్తులను గోపూజ పేరుతో ఆకర్షిస్తూ మేత, ఇతర పోషణకు రోజుకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక చందాల రూపంలో అయితే 15 రోజులకు రూ.300, 30 రోజులకు రూ.500, 90 రోజులకు రూ.1,200 అంటూ బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. అయితే ఆవులకు మేత, ఇతర పోషణ ఖర్చులు మొత్తం ఆలయ నిర్వహణ ద్వారానే సమకూరుతుండడం గమనార్హం. ఇక అన్నదాన కమిటీకు సంబంధించి ఆలయంలోనే మూడు ప్రదేశాల్లో టేబుళ్లు వేసుకుని చందాలు వసూలు చేస్తున్నారు. ఇందుకు రసీదు కూడా ఇస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఎలాంటి ఆడిట్‌ ఉండదు. భక్తుల సెంటిమెంట్‌ను తెలివిగా వ్యాపారంగా మార్చి నిలువు దోపిడీ చేస్తున్నారు.

రికార్డులంటూ ఏమీ ఉండవు..

అనధికారికంగా నిర్వహిస్తున్న గోశాల, అన్నదాన కమిటీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఉండవు. గోశాల, అన్నదాన కమిటీలకు వారానికి రూ.లక్షల్లోనే ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయానికి సంబంధించి జమాఖర్చులపై నిర్వాహకులు కానీ, దేవదాయ శాఖ ఈఓ కాని సరైన వివరాలు వెల్లడించలేకపోతున్నారు. గోశాల, అన్నదాన కమిటీలకు దాతలు, భక్తులు విరాళంగా ఇచ్చిన నగదు ప్రస్తుతం ఎంత మేర ఉందో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ అంశంపై ఇటీవల నిర్వాహకులను పంపనూరు గ్రామస్తులు నిలదీశారు. ఆ సమయంలో వారికి సరైన సమాధానాలు ఇవ్వలేక నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈఓ బాబు సైతం స్పందించకుండా ఎండోమెంట్‌తో అన్నదాన కమిటీ, గోశాలకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకున్నారు. ఈ మొత్తం గోల్‌మాల్‌ వ్యవహారాన్ని ఎండోమెంట్‌ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడం వెనుక మర్మమేమిటో సుబ్రహ్మణ్యేశ్వరుడికే తెలియాలని భక్తులు అంటున్నారు. అక్రమాలు పెచ్చుమీరుతున్నా.. దేవదాయ శాఖ ఈఓ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఇదంతా గమనించిన భక్తులు ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయ ప్రతిష్ట దిగజారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పంపనూరు క్షేత్రంలో

అక్రమార్కుల దందా

భక్తుల సెంటిమెంట్‌తో వ్యాపారం

అనధికారికంగా గోశాల,

అన్నదానం నిర్వహణ

సేవ పేరుతో రూ. లక్షల్లో వసూళ్లు

ఆడిట్‌ వివరాలు లేవంటున్న

ఎండోమెంట్‌ అధికారులు

సేవ పేరుతో దోపిడీ 1
1/2

సేవ పేరుతో దోపిడీ

సేవ పేరుతో దోపిడీ 2
2/2

సేవ పేరుతో దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement