భాషా పండితుల సమస్యలపై రాజీలేని పోరాటం | - | Sakshi
Sakshi News home page

భాషా పండితుల సమస్యలపై రాజీలేని పోరాటం

Oct 20 2025 7:50 AM | Updated on Oct 20 2025 7:50 AM

భాషా పండితుల సమస్యలపై రాజీలేని పోరాటం

భాషా పండితుల సమస్యలపై రాజీలేని పోరాటం

పండిత పరిషత్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్రిస్వామి

అనంతపురం సిటీ: రాష్ట్రంలోని భాషా పండితుల సమస్యల పరిష్కారానికి తాను రాజీ లేని పోరాటం సాగిస్తానని పండిత పరిషత్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్రిస్వామి అన్నారు. అనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఎర్రిస్వామి దంపతులను ఆ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. పండిత పరిషత్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2004 నుంచి అనేక పోరాటాలు చేసి భాషా పండితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పని చేసి, భాషల ఉనికికి, తెలుగు సంస్కృతిని కాపాడేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమేష్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి, ఏపీటీఎఫ్‌–1938 అసోసియేషన్‌ అధ్యక్షుడు కులశేఖర్‌రెడ్డి, పీఆర్‌టీయూ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్టీయూ నుంచి రమణారెడ్డి, యూటీఎఫ్‌–రమణయ్య, పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్పొరేటర్‌ శ్రీనివాసులు, హెడ్మాస్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదంలో విద్యా వ్యవస్థ

ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు

కొండూరు శ్రీనివాస్‌

అనంతపురం సిటీ: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన అసోసియేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ స్కీం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ప్లస్‌ టూ పాఠశాలల్లో పని చేసిన వారిని తిరిగి అదే పాఠశాలలకు నియమించి విద్యా ప్రమాణాల మెరుగునకు చొరవ తీసుకోవాలన్నారు. రిలీవర్‌ రాకపోవడంతో చాలా మంది బదిలీ అయిన ఉపాధ్యాయులు పాత పాఠశాలల్లోనే పని చేస్తున్నారన్నారు. వారిని తక్షణమే బదిలీ స్థానాలకు పంపాలన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేసి, బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. అర్హులైన ఎస్జీటీ (పండిట్లు)లకు పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం ఎన్‌టీఏ జిల్లా తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పతకమూరి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా రవి, ఆర్థిక కార్యదర్శిగా వెంకటేశులు, అదనపు కార్యదర్శిగా వరలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ హాజరయ్యారు.

పోరాటాలతోనే

సమస్యలకు పరిష్కారం

మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్‌

అనంతపురం టవర్‌క్లాక్‌: ఐక్య పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం దక్కుతుందని, ఇందుకు సిద్ధం కావాలని మెడికల్‌, హెల్త్‌ ఫీల్డ్‌ స్టాప్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎనుక్నున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బలరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వేమారెడ్డి, ట్రెజరర్‌గా ధనుంజయ, ఉపాధ్యక్షుడిగా హరికృష్ణ, సహాయ కార్యదర్శిగా నరసింహరావు, సభ్యులుగా నారాయణ స్వామి, కేవీ రమణ, బాలాజీ, జాన్సన్‌, గణేనాయక్‌ను ఎంపిక చేశారు. అసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె లక్ష్మన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.రాంకుమార్‌, రాష్ట్ర నాయకులు బి.వెంకటరమణ, రాఘవేంద్ర, విజయకుమార్‌ పాల్గొన్నారు.

హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

కదిరి టౌన్‌: ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చిన కేసులో ఆమె కుమారుడితో పాటు కోడలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను సీఐ నారాయణరెడ్డి ఆదివారం వెల్లడించారు. కదిరిలోని నిజాంవలీ కాలనీలో నివాసముంటున్న షేక్‌ ఖాశీంబీకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాను అడిగిన డబ్బు, ఇంటి పత్రాలు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ నెల 12న ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని కొడుకు బాబాఫకృద్దీన్‌ కత్తితో పొడిచి హతమార్చి ఉడాయించాడు. ఘటనపై హతురాలి కుమార్తె అమ్మాజాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో బాబాఫకృద్ధీన్‌, ఆయన రెండో భార్య రసూల్‌బీని ఆదివారం అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement