
కూటమి అరాచకాలపై పోరుకు సిద్ధంకండి
ఉరవకొండ: కూటమి ప్రభుత్వ అరాచకాలపై పోరుకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆ పార్టీ ఉరవకొండ సమన్వయకర్త, పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల తరపున పార్టీ గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలు నిర్మాణాత్మకంగా పనిచేయాలన్నారు. ఆదివారం ఉరవకొండలోని వీరశైవ కల్యాణ మంటపంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు తాడిపత్రి రమేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి హాజరయ్యారు. విశ్వ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించే వరుకూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు మరింత ఉధృతంగా సాగిద్దామని పిలుపునిచ్చారు. ఏడాదిన్నర పాలనలో ఆరోగ్యశ్రీ పథకానికి సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. 108, 104 గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన పూర్తి అవినీతిమయమైందని ధ్వజమెత్తారు. రైతాంగ సమస్యలు గాలికొదిలేసి ఎరువులు, విత్తనాలు అందించలేని దౌర్భగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నియోజకవర్గమంతటా ఉద్యమంలా కొనసాగాలన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 28న ఉరవకొండలో తలపెట్టిన భారీ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలన్నారు.
వజ్ర భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక మోసం చేయడమే చంద్రబాబు నైజమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రామ కమిటీలదే కీలక పాత్ర అన్నారు. తాడిపత్రి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం కాకుండా కోటి సంతకాల సేకరణతో అడ్డుకుందామన్నారు. పీపీపీ విధానం వల్ల ఒక్కో వైద్య విద్యార్థిపై రూ.5 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు భారం పడుతుందన్నారు. చంద్రబాబు విధానాల కారణంగా భావితరాలకు వైద్య విద్య అందకుండా పోతుందన్నారు. అనంతరం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాయలసీమ జోనల్ చైర్మన్ వై.ప్రణయ్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెస్త రమణ, ఎంపీపీలు కరణం పుష్పవతి, దేవీబాయి, నరసింహులు, నారాయణరెడ్డి, జెడ్పీటీసీలు ఏసీ పార్వతమ్మ, త్రిలోక్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఐదు మండలాల కన్వీనర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గ్రామ కమిటీలు నిర్మాణాత్మకంగా
పనిచేయాలి
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 28న భారీ నిరసన
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ