
సమానత్వం ప్రతి ఇంటి నుంచి రావాలి
అనంతపురం కల్చరల్: మహిళల సమానత్వమనేది ప్రతి ఇంటి నుంచి లింగ వివక్ష లేకుండా తల్లుల ద్వారానే రావాలని సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఐద్వా రాష్ట్ర మహాసభలు అనంత వేదికగా సాగుతున్న నేపథ్యంలో మూడురోజుల పాటూ జరిగే సాంస్కృతిక ఉత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కృష్ణ కళామందిరం వేదికగా జరిగిన సమావేశానికి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దాడులు, అత్యాచారాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతి మహిళా సిద్ధమయ్యేటట్లు ఐద్వా చేస్తున్న కృషిని అభినందించారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన డీఆర్వో మలోల, లలితకళాపరిషత్తు కార్యదర్శి గాజుల పద్మజ, డాక్టర్ ప్రసూన, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి తదితరులు మాట్లాడారు. అంతకు ముందు మహిళల పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆలోచింపజేసింది. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. నిర్వాహకులు డాక్టర్ ప్రగతి, సీపీఎం రాంభూపాల్, రామాంజనమ్మ, నల్లప్ప, వన్నూర్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.